బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి భారీ హెచ్చరిక
ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని, ఈరోజుకు తీవ్ర అల్పపీడనంగా మారి బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనిపై ప్రజలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. మంగళవారం కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
15న మరో అల్పపీడనం
ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో రైతులు వరి ధాన్యాన్ని నెలరోజులు ముందుగానో కోత కోసి తరలిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని తేమ తగలకుండా సురక్షితంగా ఉంచాలని, తేమ శాతం 25 వరకు ఉన్నా దాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రేపటికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు ఇది పయనించే అవకాశం ఉందంటున్నారు. దీంతోపాటు ఈనెల 14 లేదంటే 15వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారలు తెలిపారు.

కుప్పలపై 25 కిలోల ఉప్పును పనలపై చల్లాలి
అకాల వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లో వరికోతలను కోసేస్తున్నారు. అవి ఇంకా ఆరనప్పటికీ కుప్పలపై ఎకరానికి 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకొని కుప్ప వేసుకోవడంవల్ల నష్టశాతాన్ని నివారించుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. వరికోతలతోపాటు ఇతర వ్యవసాయ పంటల్లో నిమగ్నమైన రైతులంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. పనలపై ఉప్పుతో కూడిన ద్రావణాన్ని పిచికారీ చేయడంవల్ల పనలు తడిచినా గింజ మొలకెత్తకుండా ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పొలాల్లో నిల్వ ఉండే నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో వరుసగా అల్ప పీడనాలు ఏర్పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంటలు దెబ్బతినడంవల్ల నష్టానికి గురికావల్సి వస్తుందని, పంట నష్టాన్నిచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications