కూటమి ప్రభుత్వం మరో తీపికబురు.. రిజిస్ట్రేషన్ ఫీజుల్లో భారీగా రాయితీ !
ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్ రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజులపై భారీగా రాయితీ ప్రకటించింది. ప్లాట్ ధరల పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
రెండు విడతలుగా ప్లాట్ విలువ..
ఈ కొత్త విధానం ప్రకారం ఒకే ప్లాట్‌ను రెండు విడతలుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం అందిస్తోంది. ప్లాట్ మొత్తం విలువను రెండు భాగాలుగా విభజించి రిజిస్ట్రేషన్ ఫీజులు వేర్వేరుగా లెక్కించనున్నారు. ప్లాట్ విలువలో 60% బేస్ ప్రైస్‌గా, మిగిలిన 40% అభివృద్ధి ఛార్జీలుగా పరిగణిస్తారు. బేస్ ప్రైస్‌పై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు, అభివృద్ధి ఛార్జీలపై కేవలం 0.5% రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే విధిస్తారు. ఇది పాత విధానంతో పోలిస్తే ప్రజలకు భారీ ఊరటను అందిస్తుంది. ఇంతకు ముందు ప్లాట్ మొత్తం విలువపై 7.5% రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయబడింది. దీంతో మధ్య తరగతి వర్గానికి ఇది కొంత మేర అధిక భారంగా మారిందని వాదనలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఈ రెండు విడతల మోడల్‌ను తీసుకురావడం జరిగిందని స్పష్టం చేస్తున్నారు.

CRDA, విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పటికే లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించుకున్న వారు ఈ రాయితీ ప్రయోజనాన్ని పొందగలుగుతారని అధికారులఊ చెబుతున్నారు. ఈ కొత్త విధానానికి అనుగుణంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సైతం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలు తమ ప్లాట్లను రెండు రకాల దస్తావేజుల కింద రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం త్వరలో అమలులోకి వస్తుందని వెల్లడించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఊరట దక్కనుందని భావిస్తున్నారు. అలానే మధ్యతరగతి వర్గానికి ఇంటి కలను నిజం చేయడంలో ఇది సహాయపడుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మరోవైపు "ఇల్లు అందరికీ" పథకం లక్ష్యాన్ని మరింత ముందుకు నడిపించేలా ఉందని ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications