పవన్ రుషికొండ టూర్ కు నో పర్మిషన్..! అయినా వెళ్లేందుకు రెడీ ! విశాఖలో మరో టెన్షన్..
ఏపీలో జనసేన వారాహి మూడో దశ యాత్రను వైజాగ్ లో ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఇవాళ వివాదాస్పద రుషికొండ వెళ్లేందుకు ప్లాన్ చేశారు. రుషికొండపై అక్రమంగా తవ్వకాలు చేపట్టడం, దీనిపై హైకోర్టు అభ్యంతరాలు, కేంద్ర బృందంతో విచారణ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీని సందర్శన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ రుషికొండ టూర్ కు పోలీసులు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
పవన్ కళ్యాణ్ రుషికొండకు వెళ్లేందుకు వీలుగా జనసేన నేతలు పోలీసులను అనుమతి కోరారు. దీనికి పోలీసులు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రుషికొండపై సీఎం కార్యాలయం సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ బయటి వారిని ఎవరినీ అనుమతించడం లేదు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ రుషికొండ వెళ్లేందుకు కూడా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో జనసేన నేతలు పవన్ కళ్యాణ్ తో ఆయన బస చేసిన నోవోటెల్ హోటల్లో చర్చలు జరుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల్ని పర్యటించేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఇందుకు నిరాకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎలాగైనా రుషికొండ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పోలీసులు అడ్డుకుంటే అప్పుడు చూద్దామనే ధోరణిలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోవోటెల్ హోటల్ తో పాటు రుషికొండ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎవరినీ ఇక్కడకు రాకుండా అడ్డుకుంటున్నారు.
నోవోటెల్ హోటల్లో జనసేన నేతలతో సమావేశం తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళాలని పవన్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ రుషికొండకు వెళ్లేందుకు నోవోటెల్ హోటల్ నుంచి బయలుదేరితే అడ్డుకునేందుకు వీలుగా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు కూడా భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ పవన్ వైజాగ్ టూర్ సందర్భంగా ఇలాంటి ఉద్రిక్తతలే తలెత్తాయి. అప్పుడు కూడా పవన్ నోవోటెల్ హోటల్ కే పరిమితం అయ్యారు.












Click it and Unblock the Notifications