బాలినేనితో పాటు జనసేనలో చేరనున్న మరో జగన్ సన్నిహితుడు ? ముహుర్తం, పదవీ ఫిక్స్..!
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి భారీ షాకులు తప్పడం లేదు. గతంలో ఐదేళ్ల పాటు అధికారం అనుభవించిన నేతలతో పాటు దశాబ్దకాలంగా జగన్ కు అండగా నిలిచిన పలువురు సన్నిహిత నేతలు కూడా జారుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వైసీపీకీ, ఆ పార్టీ ఇచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి కూడా గుడ్ బై చెప్పేశారు. తాజాగా జగన్ కు బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడారు. ఇప్పుడు మరో జగన్ సన్నిహిత నేత కూడా ఇదే బాట పట్టబోతున్నారు.
నిన్న వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అధినేత వైఎస్ జగన్ కు లేఖ పంపిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు. అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ కానుంది. అదే సమయంలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, జగన్ కు, వైఎస్ కుటుంబానికి కూడా సన్నిహితుడిగా పేరున్న సామినేని ఉదయ భాను సైతం వైసీపీని వీడేందుకు సిద్దమవుతున్నారు.

ఇప్పటికే జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లి సంప్రదింపులు జరుపుతున్న సామినేని ఉదయబాను.. వైసీపీ నేతలకు మాత్రం అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆయన కూడా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తేలిపోయింది. ఇంకా చెప్పాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన జనసేనలో చేరబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఆదివారమే పవన్ ను కలిసేందుకు ఉదయభాను ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన పార్టీలో చేరితే ఎమ్మెల్సీ పదవి కేటాయించేందుకు జనసేన హామీ ఇచ్చింది. దీంతో ఉదయభాను రేపు, ఎల్లుండిలో వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications