టీడీపీ బాధ్యత పవన్ దే - ఎన్డీఏ భేటీలో ఏం జరిగింది, సంకేతాలు క్లియర్..!!
జనసేనాని పవన్ కొత్త బాధ్యతల్లో కనిపిస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు టీడీపీని బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసినా ఫలితం కనిపించ లేదు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ అటు టీడీపీతో బంధం పైన ఎక్కవ ఆసక్తితో కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఎన్డీఏ భేటీలో పాల్గొన్న జనసేనాని ఆ తరువాత ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
మూడు పార్టీల పొత్తు దిశగా
గతంలోనే పవన్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే విశ్వసం వ్యక్తం చేసారు. బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య దిశగా ప్రయత్నాలు చేసారు. ఆ తరువాత హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో ఢిల్లీలో చంద్రబాబు భేటీతో ఇక పొత్తు ఖాయమనే ప్రచారం సాగింది.

కానీ, కీలకమైన ఎన్డీఏ మీటింగ్ కు బీజేపీ నాయకత్వం టీడీపీని ఆహ్వానించ లేదు. జనసేనాని పవన్ ను ఆహ్వానించి తమ ఉద్దేశం ఏంటనేది స్పష్టం చేసింది. కానీ, పవన్ మాత్రం టీడీపీని తమతో కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్డీఏ సమావేశానికి హాజరైన తన వంతు ప్రయత్నాలు కొనసాగించాలని నిర్ణయించారు. తాజాగా ఢిల్లీలోనూ తన పొత్తు ఆలోచనలను స్పష్టం చేసారు.
పవన్ ప్రయత్నాలు ఫలించేనా
బీజేపీ-టీడీపీ మధ్య అండర్ స్టాండింగ్ సమస్యలు ఉన్నాయని పవన్ చెప్పుకొచ్చారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి మరోసారి మోదీకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. ఒక వైపు మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్న పవన్ అటు చంద్రబాబును తమతో కలుపుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

అయితే, పవన్ ప్రయత్నాలు ఫలించి మూడు పార్టీలు కలిస్తే 2014 ఎన్నికల తరహా పోటీ నెలకొనటం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ వైఖరిలో మార్పు లేకుండా..టీడీపీలో కలిసేందుకు ససేమిరా అంటే పవన్ అప్పుడు ఏం చేస్తారనేది ఆసక్తి కరం. అప్పుడు కూడా ఇదే తరహాలో మోదీ నాయకత్వం కోసం టీడీపీ లేకపోయినా ఎన్డీఏలోనే ఉంటారా..లేక టీడీపీనే ముఖ్యమని చంద్రబాబుతో కలుస్తారా అనేది కీలక అంశం.
టీడీపీ అదే కోరుకుంటోందా
ఎన్డీఏ సమావేశంలోనూ పవన్ ప్రధాని మోదీ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత బలోపేతం కావాలని..అందుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని పవన్ సమావేశంలో హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని బయటా చెప్పారు. దేశ పరిస్థితులపైనే సమావేశంలో చర్చ జరిగిందని..రాష్ట్ర పరిధిలోని అంశాలు చర్చించలేదన్నారు.
ఏపీ నుంచి ఎన్డీఏలోకి కొత్త పార్టీలను చేర్చుకొనే అంశం చర్చకు రాలేదని పవన్ స్పష్టం చేసారు. అయితే, ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయింది. నాడు ఎన్డీఏలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అలాంటి చంద్రబాబుకు ఎన్డీఏలోకి రీ ఎంట్రీ కోసం పవన్ ప్రయత్నం చేయటం..ఇప్పుడు టీడీపీ నిజంగా బీజేపీ పిలుపు కోసం అంతగా ఎదురుచూస్తుందా వంటి అంశాలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications