మాఫియాకు బెదరలేదు: గాలిపై బాబు పరోక్ష వ్యాఖ్య
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి, ఓఎంసి అధినేత గాలి జనార్దన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా వ్యాఖ్య చేశారు. తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని గతంలో మైనింగ్ మాఫియా తమను బెదిరించిందని, అయినా తాను బెదరలేదని, ఎవరికీ బెదిరేది లేదని ఆయన అన్నారు. శాంతిభద్రతలపై జరిగిన చర్చకు ఆయన శనివారం శాసనసభలో సమాధానం ఇచ్చారు.
తప్పులు చేసేవాళ్లను ఉపేక్షించే ప్రసక్తి లేదని, తమ పార్టీవారైనా సరే ఉపేక్షించకూడదని తాను ఆదేశాలు ఇచ్చానని ఆయన చెప్పారు. జరిగిన ప్రతిదాన్ని తమపై మోపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన, తాను ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు జరిగిన సంఘటనలను కూడా తనకు అంటగడుతున్నారని ఆయన అన్నారు.

ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియాలపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. ఎర్రచందనానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడిందని, దాన్ని ఆసరా చేసుకుని దాన్ని దోచుకునేందుకు బలమైన స్మగ్లర్ల ముఠాను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. తమ పాలనలో హైదరాబాదులో కర్ఫ్యూ విధించే పరిస్థితి లేని వాతావారణం కల్పించానని ఆయన చెప్పారు.
తాను ఇప్పటి వరకు కూడా కోర్టు మెట్లు ఎక్కలేదని చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రసంగం తర్వాత శానసశభ సోమవారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications