ఏపీలో అధికారం ఆ పార్టీదే: క్రాస్ ఓటింగ్ భయం: లేటెస్ట్ సర్వే రిపోర్ట్
AP Assembly elections 2024: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తోన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజాగళం పేరుతో రోడ్ షోలను చేపట్టారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.
అటు పోలింగ్ గడువు సమీపిస్తోంది. రేపు నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ వెంటనే నామినేషన్ల పర్వం ఆరంభమౌతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 25. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్.

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. గడువు దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తోన్నాయి.
ఎప్పటికప్పడు వాటిని విడుదల చేస్తూ వస్తోన్నాయి. అభ్యర్థుల జాబితా మొదలుకుని ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తోన్న జనాదరణ, ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను కూడా తమ సర్వే కోసం పరిగణనలోకి తీసుకుంటోన్నాయి.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్నే ధృవీకరించాయి. జన్‌మత్, లోక్ పోల్, ఆత్మసాక్షి, పోల్ స్ట్రాటజీ వంటి సంస్థలు కూడా తమ సర్వేల్లో జనం జగన్‌కే జై కొట్టిన విషయాన్ని వెల్లడించాయి.
ఈ పరిస్థితుల మధ్య- తాజాగా పొలిటికల్ క్రిటిక్.. ఏపీ రాజకీయాలపై తన సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి కట్టిన తరువాత ఈ సర్వేను చేపట్టినట్లు తెలిపిందా సంస్థ.

ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే- ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 120 నుంచి 125 అసెంబ్లీ స్థానాల్లో జయకేతనాన్ని ఎగురవేస్తుంది. విజయఢంకా మోగిస్తుంది. లోక్‌సభలోనూ ఇదే ప్రభంజనం కనిపించింది. 19 నుంచి 22 లోక్‌సభ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురుతుంది.
తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి మరోసారి పరాభవం తప్పకపోవచ్చని పొలిటికల్ క్రిటిక్ ప్రీ- పోల్ సర్వే అంచనా వేసింది. మూడు ప్రధాన పార్టీలు కలిసి కూటమి కట్టినప్పటికీ ఓటమి తప్పదని అభిప్రాయపడింది. 50 నుంచి 55 అసెంబ్లీ స్థానాలు మాత్రమే దీనికి దక్కుతాయని తేల్చి చెప్పింది. లోక్‌సభలో కూడా కూటమికి 3 నుంచి 6 స్థానాలు లభిస్తాయని పేర్కొంది.
వైఎస్ఆర్సీపీకి పోల్ అయ్యే ఓట్ల శాతం 50.80 శాతం వరకు ఉంటుంది. టీడీపీ కూటమికి పడే ఓట్ల శాతం 47.50 శాతం. ఇతరులకు 1.70 శాతం వరకు ఓట్లు పోల్ అవ్వొచ్చు. ఇందులో మహిళల ఓట్ల శాతం వైఎస్ఆర్పీకి అధికంగా ఉంటుందని పేర్కొంది.
నరసాపురం, విశాఖపట్నం లోక్‌సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి క్రాస్ ఓటింగ్ ఉంటుందని పొలిటికల్ క్రిటిక్ అంచనా వేసింది. ఈ రెండు లోక్‌సభ స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపినప్పటికీ- వీటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలను మాత్రం మెజారిటీ సంఖ్యలో కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రెండు చోట్ల తప్ప మిగిలిన అన్ని లోక్‌సభ స్థానాల్లో వైసీపీ ఆధిపత్యం కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications