అక్కడ వైసీపీకి బిగ్ డ్యామేజ్- ఇక్కడ టీడీపీకీ: ఏపీ ఎన్నికలపై లేటెస్ట్ సర్వే రిపోర్ట్
Andhra Assembly elections 2024: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోవడానికి సన్నద్ధమౌతున్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోన్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలవుతున్నాయి.
జోరుగా ప్రచారం..
ఇదివరకే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం బహిరంగ సభలతో జనంలోకి చొచ్చుకెళ్లింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా నాలుగు చోట్ల బహిరంగ సభలను నిర్వహించింది. మలిదశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 27వ తేదీన మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టనున్నారు. 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు.

కూటమి తొలి సభ..
అటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకు వచ్చింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి సభలో సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వేదికను పంచుకున్నారు.
ఎన్నికల సర్వే..
ఈ పరిస్థితుల మధ్య- ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థా దాస్.. ఏపీ ఎన్నికలపై సర్వే నిర్వహించారు. వాటి ఫలితాలను వెల్లడించారు. రెండు జిల్లాల ఓటర్ల మనోగతంతో కూడుకున్న సర్వే రిపోర్ట్ ఇది. ఉమ్మడి విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల అభిప్రాయాన్ని క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు.
విశాఖపట్నంలో..
విశాఖపట్నం జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని అంచనా వేశారు పార్థా దాస్. ఇక్కడ తెలుగుదేశం కూటమి తన పట్టు నిలుపుకొంటుందని పేర్కొన్నారు. టీడీపీ- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి 9 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ 5 నుంచి 6 సీట్లను గెలుచుకుంటుందని చెప్పారు.

ఓట్ల శాతం ఎలా..
విశాఖ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీకి 48.0 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. టీడీపీ కూటమికి 51.3 శాతం మేర ఓట్ల పడతాయి. పురుష ఓటర్లల్లో టీడీపీకి 55.9 శాతం మంది జై కొట్టారు. 44.4 శాతం మంది వైసీపీ వైపు మొగ్గు చూపారు. మహిళా ఓట్లు మాత్రం వైసీపీకే పడతాయని పార్థాదాస్ స్పష్టం చేశారు. వైసీపీకి 56.9 శాతం మంది, టీడీపీకి 42.2 శాతం మహిళలో ఓటు వేస్తారు.
నెల్లూరులో..
నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత సాధిస్తుంది. జిల్లాలో 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలుగుతుంది. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమికి దక్కే సీట్లు 3 నుంచి 4 వరకు ఉన్నాయి. వైసీపీ సాధించే ఓట్ల శాతం 52.4 శాతంగా నమోదైంది. పురుషులు- 54.4, మహిళలు 54.8 శాతం మేర ఓటు వేస్తారు. టీడీపీ కూటమికి పడే ఓట్లు 47.0 శాతం. ఇందులో పురుష ఓటర్ల శాతం 48.0, మహిళా ఓట్లు 44.5 శాతంగా నమోదైంది.












Click it and Unblock the Notifications