ఉదయాన్నే ఉడకబెట్టిన యాపిల్ మిశ్రమం తింటే తిరుగుండదు!
నేటి ఫాస్ట్ కల్చర్ లో చాలామందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో కడుపు ఉబ్బరం (గ్యాస్) ఒకటి. తిన్నది సరిగ్గా అరగక, పొట్ట ఉబ్బరంగా అనిపించడం వల్ల రోజంతా తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఖరీదైన హెల్త్ సప్లిమెంట్లు, ప్రొబయోటిక్ పౌడర్లు వాడేవారు ఎందరో ఉన్నారు. అయితే, ఏళ్లకు ఏళ్లు వేధించే ఈ జీర్ణకోశ సమస్యకు మన వంటింట్లో లభించే నాలుగు సాధారణ దినుసులతో ఇంట్లోనే సులభంగా ముగింపు పలకవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
పదేళ్ల బాధకు చెక్ పెట్టిన చిట్కా...
కడుపు ఉబ్బరంతో పదేళ్లపాటు తీవ్రంగా బాధపడిన ఒక వ్యక్తి అనుభవాన్ని న్యూట్రీషియనిస్ట్ శ్వేతా షా ఇటీవల పంచుకున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఆహారం తిన్న తర్వాత ఆయనకు కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య వేధించేది. ఎన్ని మందులు వాడినా ఉపశమనం దక్కలేదు. ఈ క్రమంలో ఆయనకు ఒక చిన్న వంటింటి చిట్కాను సూచించగా, కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ఫలితం కనిపించింది. అదే ఉడికించిన యాపిల్ మిశ్రమం.

ఈ మిశ్రమంలో అంతటి శక్తి ఉందా?
సాధారణంగా జీర్ణక్రియ మందగించడం వల్లే తిన్న ఆహారం పొట్టలో ఎక్కువ సేపు ఉండి గ్యాస్, ఉబ్బరానికి దారితీస్తుంది. ఉడికించిన యాపిల్‌లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకోవడమే ఈ చిట్కా ప్రత్యేకత.
- యాపిల్: ఇందులో సమృద్ధిగా ఉండే 'పెక్టిన్' అనే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్‌ను ఉడికించడం వల్ల పొట్టపై భారం పడకుండా త్వరగా జీర్ణమవుతుంది.
- దాల్చిన చెక్క & మిరియాల పొడి: దాల్చిన చెక్క మెటబాలిజాన్ని వేగవంతం చేస్తే, మిరియాల్లోని 'పైపరిన్' అనే పదార్థం ఆహారంలోని పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించేలా చేస్తుంది.
- నల్ల ఉప్పు: తరతరాలుగా మన భారతీయులు జీర్ణ సమస్యలకు నల్ల ఉప్పును వాడుతున్నారు. ఇది పొట్టలోని గ్యాస్‌ను తగ్గించి ఉపశమనాన్ని ఇస్తుంది.
ఎలా తయారు చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి?
ఒక యాపిల్ ముక్కను ఆవిరిపై మెత్తగా ఉడికించాలి. దానిపై చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొద్దిగా మిరియాల పొడి, చిటికెడు నల్ల ఉప్పు చల్లుకోవాలి. ఉదయాన్నే పరగడుపున కానీ లేదా ఉదయం టిఫిన్ చేసిన కాసేపటికి కానీ దీనిని బాగా నమిలి నిదానంగా తినాలి.
గమనిక: ఇది తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులకు శాశ్వత వైద్య ప్రత్యామ్నాయం కానప్పటికీ, సాధారణంగా వచ్చే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి హాయిగా ఉపశమనం పొందేందుకు అద్భుతమైన సహజసిద్ధమైన చిట్కాగా పనిచేస్తుంది.














Click it and Unblock the Notifications