నిరసనలతో అసెంబ్లీ స్టార్ట్: మండేలా మృతిపట్ల సంతాపం

దీంతో సభలో కొద్ది సేపు గందరగోళం నెలకొంది. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా సంతాప తీర్మానం ఉన్నందున నిరసనలు ఆపివేయాల్సిందిగా సభాపతి నాదెండ్ల మనోహర్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సభ్యులు తమ ఆందోళనలు విరమించిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మండేలా సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి ఆయనకు నివాళులర్పించారు. కాంగ్రెసు, బిజెపి, టిడిపి, తెరాస, సిపిఎం, సిపిఎం, మజ్లిస్, లోక్‌సత్తా పార్టీలు సంతాపం ప్రకటించాయి. ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీ సంతాపం తెలిపింది. అనంతరం శుక్రవారానికి వాయిదా పడింది.
మండేలాకు నివాళి
'జాతి వివక్షకు వ్యతిరేకంగా, మానవ హక్కుల కోసం పోరాడిన యోధుడు నెల్సన్ మండేలా. మండేలాకు వచ్చిన పురస్కారాలకు లెక్కే లేదు. స్వేచ్ఛ, స్వాతంత్రం కోరుకునే ప్రతి ఒక్కరికి మండేలా మృతి తీరని లోటు. మండేలా మానవజాతి చరిత్రలో మహా శిఖరం.' - కిరణ్ కుమార్ రెడ్డి
'మండేలా కృషి ఫలితంగా దక్షిణాఫ్రికాకు విముక్తి లభించింది. భారత జాతిపిత మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం మండేలాకు స్ఫూర్తి. గాంధీ ప్రభావం తనపై ఉందని మండేలా చెప్పడం మనకు గర్వకారణం. గాంధీ స్ఫూర్తితో సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. కనీసం ఓటు హక్కు లేని నల్లజాతీయుల తరఫున పోరాడారు. ఆఫ్రికన్ల స్థితిగతులను మెరుగుపర్చారు. యుగపురుషుల్లో మండేలా ఒకరు. మన దేశం మండేలాకు భారతరత్న ఇచ్చింది. అందుకు మనం గర్వపడాలి. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాం. యుగపురుషుడిని కోల్పోయాం.' - చంద్రబాబు నాయుడు
'పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అన్న సామెత మండేలాకు వర్తిస్తుంది. దేశానికి బతుకును అంకితం చేసిన మహానుభావుడు. మండేలా ఆత్మస్థైర్యాన్ని జైలు జీవితం కూడా దెబ్బతీయలేదు. నల్లజాతీయులు, ఆఫ్రికన్ల తరఫున పోరాడారు. జీవితంలో పోరాటాన్ని పర్యాయపదంగా చేసుకున్నారు. మరణానికి వెరవకుండా చెరసాలలోను పోరాటం సాగించారు. తాను కొవ్వత్తిలా కరిగిపోతు ఇతరులకు వెలుగును అందించారు. ప్రపంచంలో దోపిడీ, పీడితులు ఉన్నంత వరకు పోరాటం కొనసాగుతుందని మండేలా అన్నారు. వలసపాలకుల ఆధిపత్యాన్ని తుంచి వేశారు. చెరసాలను ఉద్యమ ఖిల్లాగా మార్చుకున్నారు. మండేలా మృతితో ప్రపంచ పోరాటల చరిత్రలో ఓ శకం ముగిసింది. మీ హక్కులకై పోరాడు, సమానత్వం కోసం పోరాడు కానీ, ఇతరుల హక్కుల కోసం పోరాడవద్దని మండేలా చెప్పారు.' - కెటి రామారావు.
'మండేలా జీవితం ఓ సందేశం. ఆయన పట్టుదల, అంహిసా ఉద్యమ పోరు మహాత్ముడిని గుర్తు చేస్తుంటాయి. అందుకే ఆయనకు భారతరత్న ఇచ్చి మన దేశం గౌరవించింది. మానవాళిని చేతలు, మాటల ద్వారా నడిపిన మహనీయుడు మండేలా.' - వైయస్ విజయమ్మ
కాగా, అంతకుముందు అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు సిపిఎం శాసన సభ్యులు జూలకంటి రంగారావు సైకిల్ పైన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లు ఒక్కటే ప్రధానం కాదని, తెలంగాణ బిల్లును అడ్డుపెట్టుకొని ప్రజా సమస్యలను మరుగుపర్చవద్దన్నారు. టిటిడిపి, తెరాస, బిజెపి శాసన సభ్యులు గన్ పార్కు వద్ద నివాళులు అర్పించారు.