దంచికొడుతున్న వానలు, మరో రెండు రోజులు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!!
తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రికార్డు ఉష్ణోగ్రతలు.. ఉక్కపోతతో సత మతం అయిన ప్రజలకు ఉపశమనం కలిగింది. ఒక్క సారిగా వర్షాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల గాలి వాన బీభత్సం కారణంగా రైతులు నష్టపోయారు. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వర్షం కొనసాగుతోంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు చేసింది.
వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల తో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఏపీలోని గోదావరి.. సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కడప, శ్రీసత్యసాయి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా రాత్రి కురిసిన వర్షంతో జనం తీవ్ర ఇబ్బందులలు పడ్డారు. పలుచోట్ల పిడుగుపాట్లు, చెట్లు విరిగిపడటం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం దంచికొడుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరంలో కురుస్తోంది. కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో భరీగా వర్షం పడుతోంది. రోహిణీ కార్తి ప్రభావంతో గత రెండు రోజులుగా నిప్పుల కుంపటిలా ఉన్న నగరం తాజా జల్లులతో చల్లబడింది.

అర్ద్రరాత్రి నుంచి కురుస్తున్న వాన
ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. కడప, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల కు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో కురిసిన వర్షానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. దేవళం బజారు నుంచి వచ్చిన నీరు రాజగోపురం గుండా లోపలికి ప్రవేశించడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. విజయ నగరం, మన్యం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. విజయనగరంతో పాటు పలు మండలాల్లో భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మన్యం జిల్లాలోని పలు మండలాల్లో గాలివానకు విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.













Click it and Unblock the Notifications