గోదావరిలో దూకిన ఏఈ కుటుంబం.. కోచింగ్ పేరుతో సాధిక్ ఖాన్ రాసలీలల గుట్టు రట్టు!
కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తిల్లపూడి నూకరాజు కుటుంబం గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ వేధింపులే ప్రధాన కారణమని తేలింది. ప్రాణాలతో బయటపడిన ఏఈ మనవడు కార్తికేయ ఇచ్చిన సమాచారంతో సర్పవరం పోలీస్ స్టేషన్లో సాధిక్‌ఖాన్‌పై హత్యాయత్నం, ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా మరో ఐదు కఠిన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మభ్యపెట్టి కుటుంబాన్ని బందీగా చేసుకున్న వైనం
షూటింగ్ అకాడమీ నడుపుతున్నషేక్ సాధిక్ ఖాన్.. తన వద్దకు షూటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన బాలుడిని అడ్డుపెట్టుకుని అతడి తల్లి సౌజన్యతో(నూకరాజు కూతురు) సన్నిహితంగా మెలిగాడు. మాటలతో మభ్యపెట్టి ఆ ఇంట్లోని వ్యవహారాలన్నీ తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. వారి వద్ద ఉన్న విలువైన బంగారం, నగదు, బ్యాంక్ ఏటీఎం కార్డులతో పాటు ఆస్తి పత్రాలను కూడా లాక్కున్నాడు. ఆ కుటుంబం బయటకు చెప్పలేని విధంగా తీవ్ర మానసిక హింసకు గురిచేస్తూ నరకం చూపించాడు.

వెలుగులోకి వచ్చిన లేఖ.. భర్తను విషమిచ్చి చంపాడంటూ ఆవేదన
నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ చేసుకునే ముందు అందుకు గల కారణాలను లేఖలో రాసి వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయగా.. కూతురు సౌజన్య మరో లేఖ రాసి స్కూటర్ డిక్కీలో ఉంచింది. పోలీసులకు లభ్యమైన సౌజన్య లేఖలోని విషయాలు అధికారులను తీవ్రంగా కలిచివేశాయి. జులై 2న తన భర్త జగదీశ్వరరెడ్డి చనిపోవడం వెనుక సాధిక్ ఖాన్ హస్తం ఉందని.. అతడే విష పదార్థమిచ్చి చంపేశాడని ఆమె ఆ లేఖలో పేర్కొంది. అంతేకాకుండా తన ప్రైవేట్ ఫోటోలను అడ్డుపెట్టుకుని బెదిరించాడని, మతం మారాలని తీవ్రంగా ఒత్తిడి చేశాడని ఆమె తన ఆవేదనను వెళ్లగక్కింది.
గాలింపు చేపట్టిన పోలీసు బృందాలు
ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతోనే ప్రధాన నిందితుడు సాధిక్ ఖాన్ తన సెల్‌ఫోన్‌ను ఇంట్లోనే వదిలేసి కాకినాడ నుంచి పరారయ్యాడు. రైలులో వెళ్తూ వేరే వ్యక్తుల ఫోన్ల నుంచి కుటుంబ సభ్యులకు, ఓ న్యాయవాదికి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి మొత్తం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
షూటింగ్ అకాడమీ పేరుతో అకృత్యాలు
సాధిక్ ఖాన్ రైఫిల్ షూటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నప్పటికీ.. అతడి అసలు లక్ష్యం అకాడమీకి వచ్చే మహిళలు, యువతులపైనేనని పలు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక శిక్షణ పేరిట ఇతర విద్యార్థులు లేని సమయాల్లో పిలిపించుకుని ప్రవర్తించేవాడని, శిక్షణ ఇచ్చే నెపంతో అసభ్యకరంగా తాకేవాడని కొందరు బాధితులు వెల్లడించారు. ప్రాంతీయ క్రీడా ప్రాధికార సంస్థలో సరియైన ఎలక్ట్రానిక్ షూటింగ్ సదుపాయాలు లేకపోవడంతో గత్యంతరం లేకనే సాధిక్ ఖాన్ అకాడమీకి వెళ్లాల్సి వచ్చేదని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications