మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?
ఏపీ రాజకీయాల్లో 2024 ఎన్నికలు పెను మార్పును తెచ్చాయి. అప్పటివరకూ 150కి పైగా ఎమ్మెల్యేలతో దుర్బేద్యంగా కనిపించిన వైసీపీ (YSrCP) కాస్తా ఎన్నికల ఫలితాల తర్వాత 11 సీట్లకు పడిపోయింది. అదే సమయంలో శాసనమండలిలో (AP Legislative Council) మాత్రం 50 ఎమ్మెల్సీలు ఉండటంతో పటిష్టంగా కనిపించింది. అయినా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో.. మండలిపై వైసీపీ పట్టు కొనసాగించడం అంత సులువు కాదని అంతా భావించారు. కానీ రెండున్నరేళ్ల పాలన తర్వాత కూడా కూటమి మండలిపై పట్టు సాధించడంలో విఫలం కాగా.. వైసీపీ మాత్రం అదే పట్టు కొనసాగిస్తుండటం విశేషం.
ఈ నేపథ్యంలో తాజాగా మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక వచ్చింది. గతంలో వైసీపీ మండలి ఛైర్మన్ గా గెలిపించుకున్న జకియా ఖానం.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. అయినా ఛైర్మన్ రూపంలో కొయ్యే మోషేన్ రాజు ఉండటంతో కూటమి ఫిరాయింపులు రాజకీయాలు పనిచేయలేదు. వైసీపీ నుంచి కూటమిలోకి ఆరుగురు ఎమ్మెల్సీలు ఫిరాయించినా వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మోషన్ రాజు సైలెంట్ గా ఉండిపోవడంతో చంద్రబాబు కూడా చేసేదేమీ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్ధితుల్లో జకియా ఖానం పదవీకాలం ముగిసిపోయి మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక రావడంతో కూటమి కచ్చితంగా అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకుంటుందని అంతా భావింంచారు. కానీ ఇక్కడా సీన్ రివర్స్ అయింది.

వైసీపీ మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి నిలబెట్టిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుకు పోటీగా కూటమి నుంచి అభ్యర్దిని నిలబెట్టలేదు. దీంతో ఆయన ఏకగ్రీవంగా మండలి డిప్యూటీ ఛైర్మన్ కాబోతున్నారు. దీంతో మండలిలో ఛైర్మన్ గా కొయ్యే మోషేన్ రాజు, విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ తర్వాత మూడో కీలక పదవిలోనూ మరో వైసీపీ నేత ఎంపికయ్యారు. తద్వారా వైసీపీ ఇక్కడ హ్యాట్రిక్ సాధించింది. అదే సమయంలో సొంత ప్రభుత్వం ఉన్నా.. వైసీపీ ఎమ్మెల్సీలను తమవైపు తిప్పుకోవడంలో ప్రభుత్వం విఫలమైనట్లయింది. దీని వెనుక మరో కారణం ఫిరాయింపులకు దిగితే సదరు ఎమ్మెల్సీలపై మండలి ఛైర్మన్ వేటు వేసే ప్రమాదం పొంచి ఉండటమే. మరోవైపు గతంలో స్దానిక సంస్దల కోటాలో బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకోవడంలోనూ కూటమి విఫలమైంది. తాజా పరిణామంతో కూటమి సర్కార్ పై పైచేయి సాధించిన వైసీపీ.. మండలిలో మరోసారి పట్టు నిలుపుకుంది.














Click it and Unblock the Notifications