సీఎం విజయ్ వరాల మూట: ఒక్కటి కాదు..: ప్రతి ఎమ్మెల్యేకూ ప్రభుత్వ కారు, రూ. 25 లక్షల కవరేజ్
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని శాసనసభ్యులందరికీ నూతనంగా కార్లను సమకూర్చనున్నట్లు తెలిపారు. ఆరోగ్యం, వైద్య విద్యను బలోపేతం చేసేలా నూతన పథకాలను ప్రకటించారు. సామాన్య ప్రజల కోసం ఓ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించబోతోన్నట్లు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న హెల్త్ కవరేజీని కూడా భారీగా పెంచారు.
తమ తమ నియోజకవర్గాల్లో చురుగ్గా పర్యటించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఒక్కో కారును సమకూర్చుతామని, దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని విజయ్ వెల్లడించారు. వాటి నిర్వహణ, డ్రైవర్ వేతనం, ఇంధన వ్యయం, అవసరమైన ఇతరత్రా ఆర్థిక సాయాన్ని కూడా తామే చెల్లిస్తామని చెప్పారు. దీనికోసం ఒక్కో ఎమ్మెల్యేకు ప్రతి నెలా 75,000 రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తామని అన్నారు.

దీంతో పాటు, నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే కార్యాలయాల్లో ఓ అసిస్టెంట్ ను కూడా నియమించుకోవడానికి నెలకు మరో 25,000 రూపాయల భత్యాన్ని కూడా ప్రకటించారు విజయ్. ఈ కారును దుర్వినియోగం చేయకూడదని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ వెళ్లి స్థానికులను పలకరించాలని, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. దీనివల్ల వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి వెసలుబాటు లభిస్తుందని వ్యాఖ్యానించారు.
అలాగే.. తన సొంత నియోజకవర్గం పెరంబూర్ లో 400 పడకల సామర్థ్యం గల ఓ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రకటించారు విజయ్. దీని నిర్మాణం అంచనా వ్యయం 300 కోట్ల రూపాయలు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం వార్షిక క్లెయిమ్ పరిమితిని 5 లక్షల నుండి ఒకేసారి 25 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. చెన్నై స్టాన్లీ, తిరునెల్వేలి, కన్యాకుమారి వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక సంరక్షణ, శస్త్రచికిత్స సేవలను ఉచితంగా అందించనున్నారు.
వైద్య రంగంలో మానవ వనరుల కొరతను అధిగమించడానికి మరో 351 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 6,098 సీట్లను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇందులో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థుల కోసం 660 సీట్లతో పాటు నర్సింగ్ కాలేజీల్లో 1,925 సీట్లు అందుబాటులోకి వస్తాయి. పారామెడికల్ కోర్సుల్లో 2,778 సీట్లు, మెయిన్ స్ట్రీమ్ వైద్య కోర్సుల్లో 735 సీట్లను పెంచడంతో పాటు కొత్తగా ఏడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను నెలకొల్పుతారు.
శాసనసభ్యులకు రవాణా సదుపాయాలు కల్పించాలంటూ అసెంబ్లీలో వీసీకే పార్టీ సభ్యురాలు జోతిమణి ప్రతిపాదించిన వెంటనే ముఖ్యమంత్రి విజయ్ స్పందించి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఆర్థిక పరిమితుల కారణంగా ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టాయి. స్థానిక చైర్మన్లు, మేయర్లకు ప్రభుత్వ వాహనాలు ఉన్నప్పటికీ, విస్తృత పరిధి ఉండే ఎమ్మెల్యేలకు వాహనాలు లేకపోవడంతో పనుల పర్యవేక్షణ కష్టంగా మారుతోందని సీనియర్ సభ్యులు ప్రస్తావించారు. ప్రస్తుతం సీఎం విజయ్ తీసుకున్న ఈ చర్యలపై సభలో హర్షం వ్యక్తమైంది.















Click it and Unblock the Notifications