శబరిమల అయ్యప్ప స్వామి కిరీటం మాయం! నకిలీ కిరీటం ప్రత్యక్షం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో తీవ్ర సంచలనం రేపిన ఘటన వెలుగు చూసింది. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించిన విలువైన బంగారు కిరీటం అదృశ్యమైనట్లు ఆలయ స్టాక్ వెరిఫికేషన్‌లో తేలింది. అసలు కిరీటం మాయమై, దాని స్థానంలో అచ్చం అలాగే కనిపించే ఒక నకిలీ కిరీటం ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తమిళనాడకు చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్లు భక్తితో ఆగస్ట్ 2012లో ఈ బంగారు కిరీటాన్ని స్వామివారికి కానుకగా సమర్పించారు. అప్పట్లో చింగం 1వ తేదీన ఈ కిరీటాన్ని అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరించి, ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్‌కు భద్రపరిచారు.
అయితే, ప్రస్తుతం హైకోర్టు నియమించిన అమికస్ క్యూరీ జస్టిస్ కేటీ శంకరన్ ఆధ్వర్యంలో శబరిమల స్టోర్‌రూమ్ అలాగే ఆరన్ముల స్ట్రాంగ్ రూమ్‌లో కూలంకషంగా స్టాక్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల సమయంలోనే అసలు విషయం బయటపడింది. అసలు కిరీటం బరువు 445.78 గ్రాములు ఉండగా, అందులో 55.72 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉంది. అంతేకాకుండా ఆ కిరీటంపై విలువైన రత్నాలు కూడా పొందుపరిచి ఉన్నాయి. కానీ, ప్రస్తుతం స్టోర్‌రూమ్‌లో దొరికిన నకిలీ కిరీటం కేవలం 240 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో పాటు, దానిలో బంగారపు జాడ లేకపోవడం గమనార్హం.

బంగారు గొలుసు కూడా మాయం.. నిబంధనలకు తూట్లు
కేవలం కిరీటం మాత్రమే కాకుండా, ఆరన్ముల స్ట్రాంగ్ రూమ్‌లో చేపట్టిన తనిఖీల సమయంలో నాలుగు సవర్ల బంగారు గొలుసు కూడా మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఆలయ నియమాల ప్రకారం భక్తులు సమర్పించే అత్యంత విలువైన కానుకలను మొదట రికార్డు పుస్తకంలో నమోదు చేసి, ఆ తర్వాత వాటిని ఆరన్ముల స్ట్రాంగ్ రూమ్‌కు సురక్షితంగా తరలించాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యవహారంలో రికార్డులకు, భద్రతకు మధ్య ఎక్కడో భారీ లోపాలు జరిగినట్లు స్పష్టమవుతోంది. అంతటి పవిత్రమైన స్థలంలో ఇంత పెద్ద ఎత్తున విలువైన వస్తువులు మాయమవడం వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఆందోళన వ్యక్తం చేసిన టీడీబీ ప్రెసిడెంట్.. విచారణకు డిమాండ్
ఈ ఘటనపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ కే. జయకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శబరిమలలో విలువైన వస్తువులు మాయమయ్యాయనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందని ఆయన వెల్లడించారు.
ఇలాంటి అత్యంత విలువైన కానుకలను కచ్చితంగా ఆరన్ముల స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఆలయ పరిపాలనా వ్యవస్థలో ఉన్న లోపాలు, లోపాయికారీ తప్పుల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.














Click it and Unblock the Notifications
