రేపే సీఎం రాజీనామా? కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి! కానీ..
కర్ణాటక రాజకీయాల్లో హైడ్రామా ముదిరింది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం వేసిన వ్యూహాలు, సిద్ధరామయ్య విసిరిన ఎదురుదాడితో కన్నడ రాజకీయం 'కర్నాటకం'గా మారిపోయింది. కొన్నాళ్లుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న నాయకత్వ మార్పు వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవిని వదులుకునేందుకు దాదాపు సిద్ధమయ్యారని, గురువారం ఉదయం తన సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చిన అనంతరం బెంగళూరులోని లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా సమర్పిస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో దావానలంలా వ్యాపించాయి. దీంతో దిల్లీ నుంచి బెంగళూరు దాకా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది.
దిల్లీ వేదికగా హైవోల్టేజ్ పంచాయితీ..
కర్ణాటక పీఠంపై నెలకొన్న సందిగ్ధతను తెల్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మంగళవారం దిల్లీ వేదికగా గంటల తరబడి హైవోల్టేజ్ చర్చలు జరిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్‌ఛార్జి రణ్‌దీప్ సుర్జేవాలా సమక్షంలో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లతో అధిష్ఠానం పలు దఫాలుగా భేటీ అయింది. రాష్ట్రంలో సజావుగా నాయకత్వ మార్పు జరగడానికి సహకరించాలని, సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి తప్పుకోవాలని అధిష్ఠానం సూటిగా కోరినట్లు సమాచారం.

దిల్లీ ఆఫర్ వర్సెస్ సిద్ధూ పంతం!
రాజీనామాకు ప్రతిఫలంగా సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పెద్దలు భారీ ఆఫర్లనే ముందుంచారు. త్వరలో ఖాళీ కానున్న మల్లికార్జున ఖర్గే రాజ్యసభ స్థానాన్ని సిద్ధూకు ఇచ్చి, ఏకంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవిని కట్టబెడతామని ప్రతిపాదించారు. అంతేకాకుండా, ఆయన కుమారుడు యతీంద్రకు కర్ణాటక క్యాబినెట్‌లో ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే, మాస్ లీడర్‌గా ఉన్న సిద్ధరామయ్య ఈ ప్రతిపాదనలను తొలుత సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం చెబుతానని పట్టుబట్టడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఉక్కిరిబిక్కిరి అయింది.
డీకే సీఎం కలలకు 'అహింద' చెక్!
మరోవైపు, అధికార పంపిణీ ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల గడువు ముగిసినందున ఈసారి ముఖ్యమంత్రి పీఠం తనకే దక్కాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గట్టిగా డిమాండ్ చేశారు. అయితే, డీకేకు నేరుగా చెక్ పెట్టేలా సిద్ధరామయ్య సరికొత్త పొలిటికల్ మెలిక పెట్టారు.
"నాకు వంద మంది ఎమ్మెల్యేల పూర్తి మద్దతుంది. శాసనసభాపక్షంలో ఓటింగ్ ద్వారా నేను సీఎం అయ్యాను. ఒకవేళ నేను దిగిపోవాల్సి వస్తే.. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న 'అహింద' (వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు) నేతకే సీఎం కుర్చీ ఇవ్వాలి" అని సిద్ధూ కండిషన్ పెట్టారు.
దీనికి అధిష్ఠానం ఒప్పుకుంటే దళిత నేత, ప్రస్తుత హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిద్ధరామయ్య వ్యూహంతో డీకే శివకుమార్ సీఎం కలలకు గండిపడేలా కనిపిస్తోంది.
పైకి 'ఆల్ ఈజ్ వెల్'.. లోపల అసలు ఖేల్!
దిల్లీలో ఇంతటి పొలిటికల్ వార్ నడిచినా.. బయటకు మాత్రం కాంగ్రెస్ నేతలు అంతా సవ్యంగానే ఉందనే కలరింగ్ ఇస్తున్నారు. భేటీ అనంతరం కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ.. తాము కేవలం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపైనే చర్చించామని, సీఎం మార్పు వార్తలన్నీ కేవలం వదంతులేనని కొట్టిపారేశారు. అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం లీడర్‌షిప్ మార్పు అంశం అసలు చర్చకే రాలేదని దాటవేశారు. పైకి నాయకులు ఖండిస్తున్నప్పటికీ.. లోపల జరుగుతున్న పరిణామాలు, గురువారం నాటి సిద్ధూ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ చూస్తుంటే కర్ణాటకలో ఏ క్షణమైనా పొలిటికల్ బాంబ్ పేలేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు!














Click it and Unblock the Notifications