లోకేష్ నాయకత్వంలో ఫస్ట్ టైమ్.. 2029 ఎన్నికల రోడ్‌మ్యాప్ రెడీ!
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే వార్షిక ఉత్సవం 'మహానాడు' ఈసారి సరికొత్త హంగులతో, అనేక ప్రత్యేకతలకు వేదికగా మారుతోంది. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకను కేవలం ఒక రాజకీయ సభలా కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత, సామాజిక సమతుల్యత కలబోసి సరికొత్త వ్యూహంతో రూపొందించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో, ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు టీడీపీ సానుకూలంగా స్పందించింది. ఖర్చులను అదుపు చేస్తూ, కేడర్‌లో ఉత్సాహం తగ్గకుండా ఈసారి మహానాడును పూర్తిగా 'హైబ్రిడ్' పద్ధతిలో నిర్వహిస్తున్నారు. గతంలో కొవిడ్ సమయంలో కేవలం ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించగా, ఈ తరహా హైబ్రిడ్ విధానాన్ని అమలు చేయడం పార్టీ చరిత్రలోనే ఇదే తొలిసారి.

డిజిటల్ విప్లవం.. లక్షలాది మందితో అనుసంధానం
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికగా సాగుతున్న ఈ సభకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,851 క్లస్టర్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాల కార్యాలయాలను అత్యాధునిక 'జూమ్' ప్లాట్‌ఫామ్ ద్వారా అనుసంధానించారు. ఇంటర్నెట్ ఇబ్బందులు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దాదాపు 200 కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలతో నేరుగా మాట్లాడే 'టు వే' (Two-way) ఇంటరాక్షన్ సదుపాయాన్ని కల్పించారు. ప్రతి క్లస్టర్ పరిధిలో సుమారు 300 మంది చొప్పున, మొత్తంగా 5.60 లక్షలకు పైగా కేడర్ ఒకేసారి ఆన్‌లైన్ ద్వారా ఇందులో భాగస్వాములు కావడం ఒక రికార్డుగా నిలవనుంది.
అండమాన్ తీర్మానం.. అంతర్జాతీయ స్థాయి పాయింట్లు
ఈసారి మహానాడు పరిధిని మరింత విస్తరిస్తూ తొలిసారిగా అండమాన్‌కు సంబంధించిన ఒక ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. అక్కడి పార్టీ శ్రేణులను కూడా డిజిటల్ స్క్రీన్ల ద్వారా ప్రధాన వేదికతో అనుసంధానం చేశారు. టీడీపీకి ఉన్న సాంకేతిక బలంతో ఏకకాలంలో 10 వేల పాయింట్లను కనెక్ట్ చేసే వీలుండటంతో.. ఏపీ, తెలంగాణలతో పాటు దేశ, విదేశాల్లోని తెలుగువారందరూ వీక్షించేలా యూట్యూబ్ లైవ్ లింక్‌లను కూడా అందుబాటులో ఉంచారు.
'స్త్రీశక్తి' థీమ్.. మహిళలు, యువతకే అగ్రతాంబూలం
ఈ ఏడాది మహానాడుకు 'స్త్రీశక్తి'ని ప్రధాన ఇతివృత్తం (థీమ్)గా ఎంచుకోవడం విశేషం. వక్తల ఎంపికలో మహిళలకు, యువతకు పెద్దపీట వేశారు.
- అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టే బాధ్యతను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో పాటు మంత్రి వంగలపూడి అనితకు అప్పగించారు.
- పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నలుగురు మహిళా కార్యకర్తలను (మాధవి, కళావతి, శిరీష, వసుంధర) వేదికపై ఘనంగా సత్కరించనున్నారు.
- కొత్తగా పొలిట్‌బ్యూరోలో స్థానం పొందిన గంట్యాడ శ్రీదేవితో పాటు, సామాజిక సమతుల్యతలో భాగంగా ట్రాన్స్‌జెండర్ ప్రతినిధి నీరజారాణికి కూడా ప్రసంగించే అరుదైన అవకాశం కల్పించారు.
జెన్-జీ (Gen-Z) తో చంద్రబాబు ముఖాముఖి
మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త తరం ఓటర్లను, కేడర్‌ను ఆకట్టుకునేలా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 'జెన్-జీ' (Gen-Z) యువతతో ప్రత్యేకంగా ఇంటరాక్షన్ నిర్వహించనున్నారు. యువత ఆలోచనలు తెలుసుకుంటూ, వారికి పార్టీ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేయడం ఈ మహానాడులోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
లోకేష్ నాయకత్వంలో తొలి మహానాడు.. 2029కి రోడ్‌మ్యాప్
నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావడం, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో కేడర్‌ను సమాయత్తం చేసేందుకు ఈ వేదికను వాడుకుంటున్నారు. రెండేళ్ల ప్రభుత్వ విజయాలు, పెట్టుబడులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, 2029 ఎన్నికలకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను ఇక్కడే సిద్ధం చేయనున్నారు.
మొత్తం 20 తీర్మానాలు, 65 మంది వక్తలతో కచ్చితమైన సమయ పాలన (3-5 నిమిషాల ప్రసంగాలు) పాటిస్తూ.. అటు పొదుపును, ఇటు సాంకేతిక హంగులను జోడించి సరికొత్త పంథాలో సాగుతున్న ఈ 'హైబ్రిడ్ మహానాడు' తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపుతోంది.














Click it and Unblock the Notifications