బద్వేల్లో మాదే నైతిక గెలుపు-వైసీపీది అధర్మ యుద్ధం- పెరిగిన బీజేపీ ఓటింగ్- సోము కామెంట్స్
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ ఘనవిజయం నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. బీజేపీ అభ్యర్ధి సురేష్ కేవలం 21 వేల ఓట్లకే పరిమితమైన నేపథ్యంలో సోము వీర్రాజు ఈ ఓటమిపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. బద్వేల్లో బీజేపీ ఓటమికి గల కారణాలను ఆయన విశ్లేషించారు.
బద్వేల్లో ప్రజలు బీజేపీని ఆదరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. బీజేపీదే నైతిక విజయమన్నారు. బద్వేల్లో ఏం చేస్తామమో కరపత్రం ఇచ్చి మరీ ఓట్లు అడిగామని సోము పేర్కొన్నారు. కానీ వైసీపీ వెయ్యి నోటు ఇచ్చి ఓటు ఆడిగిందన్నారు. బద్వేల్లో ప్రజాస్వామ్య బద్దంగా పోలింగ్ జరగాలని బీజేపీ కోరినట్లు సోము వెల్లడించారు. వైసీపీ బయటవారిని తీసుకుని వచ్చి రిగ్గింగ్ కు పాల్పడిందని ఆయన ఆరోపించారు.

బద్వేల్లో ఐదుగురు మంత్రులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేశారని సోము వీర్రాజు గుర్తు చేశారు. బీజేపీ మాత్రం అభ్యర్థి ప్రధానంగా ప్రచారం చేసినట్లు సోము తెలిపారు. కులాల వారీగా వైసీపీ సమావేశాలు నిర్వహించి నయానా ,భయానా లొంగదీసుకునే ప్రయత్నం చేసిందని ఆయన వెల్లడించారు. తాము అభివృద్ధి పై చర్చకు రమ్మంటే.. వైసీపీ ముఖం చాటేసిందన్నారు. తాము ధర్మయుద్దం చేశామని, వైసీపీ అధర్మయుద్దం చేసిందని సోము పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాల కే వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత. కొట్టచ్చినట్లు బద్వేలు ఎన్నికల ఫలితాలు వల్ల అర్థం అవుతోందన్నారు.
బద్వేల్ నియోజకవర్గ పరిధిలో 40వేల ఓట్లు రిగ్గింగ్ చేశారని సోము ఆరోపించారు. నోటుతో ఓట్లు కొనుగోలు చేశారని వైసీపీపై ఆరోపణలు చేశారు. అయినప్పటికీ గత ఎన్నికల కంటే ఇప్పుడు 10శాతం పోలింగ్ తగ్గింది అంటే ప్రభుత్వం పై వ్యతిరేకతే కారణమన్నారు. బిజెపికి సాధారణ ఎన్నికల కంటే 300 శాతం ఓటింగ్ పెరిగిందని సోము గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications