
ఎందుకీ కేబినెట్ ప్రక్షాళన ? మంత్రుల అవినీతా అసమర్ధతా ? బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నలు
ఏపీలో ఇవాళ జరిగిన కేబినెట్ విస్తరణపై బీజేపీ నేతలు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా జగన్ కేబినెట్ ప్రక్షాళన ఓ సహేతుకమైన కారణం లేకుండా చేశారంటూ నేతలు మండిపడుతున్నారు. అందులోనూ సలహాదారు సజ్జల పోషించిన పాత్రపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సూటి ప్రశ్నలు వేశారు.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అధికార పార్టీని అసమ్మతి సెగలు కమ్ముకునేలా చేశాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. నిన్నటి వరకు మాకు ఒక్కడే నాయకుడు అని డప్పులు కొట్టుకున్న పాలకపక్షం నేతలు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని జీవీఎల్ విమర్శించారు. ఒకే మాట ఒకే బాట అన్న నాయకులు నేడు పదవులకు ఏడుపులు, పెడబెబబులు చూస్తుంటే వైసీపీ పతనం మొదలైందని ఆయన విశ్లేషించారు.

ఇవాళ మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వైసీపీ నేతలు పలువురు గైర్హాజరయ్యారని బీజేపీ ఎంపీ జీవీఎల్ గుర్తుచేశారు. రోడ్లపై ఆందోళనల్ని కూడా ప్రస్తావించారు. మాజీ హోమ్ మంత్రి సుచరిత రాజీనామా చేయడం, మాజీ మంత్రులు అందరూ అలక బూనడాన్ని జీవీఎల్ తప్పుబట్టారు. మంత్రివర్గ ఏర్పాటులో జగన్ మోహన్ రెడ్డి పాటించిన విధానమేమిటని జీవీఎల్ ప్రశ్నించారు. మంత్రుల అవినీతి కారణంగానా లేక అసమర్ధతతోనే ఈ ప్రక్షాళన జరిగిందని ఆయన ప్రశ్నించారు.
అలాగే కేబినెట్ మంత్రులను తొలగించడంలో సలహదారుడికి అధికారమెక్కడుందని సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి జీవీఎల్ వ్యాఖ్యానించారు. ప్రధాన సలహా దారు రాజ్యాంగ బద్ధమైన పదవి కాదన్నారు. సజ్జల వ్యవహారంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న వారిని మంత్రి పదవుల నుండి తొలగిస్తే వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారని జీవీఎల్ ప్రశ్నించారు. కమ్మ,బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాలకు చెందిన కొడాలి నాని, వెల్లంపల్లి, శ్రీరంగనాధరాజులను సామాజికంగా అణగదొక్కారని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. నిజమైన సాధికారత అంటే బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయడం. ఆ దమ్ము మీకు ఉందా అని సీఎం జగన్ ను జీవీఎల్ ప్రశ్నించారు.