Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాజా ప్లాన్-కేంద్రానికి బీజేపీ ఎంపీల ప్రతిపాదన..!
కేంద్రం దేశవ్యాప్తంగా చేపడుతున్న వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా చేపట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏపీలో సెంటిమెంట్ ను రాజేయడంతో దీనిపై ఎటూ తేల్చలేని పరిస్ధితి నెలకొంది. ప్రైవేటీకరణపై ముందుకెళ్తే ఓ తలనొప్పి, వెనక్కి తగ్గితే మరో తలనొప్పిగా మారిన పరిస్ధితుల్లో కేంద్రం దీనిపై ఏ నిర్ణయం తీసుకోకుండా వేచి చూస్తోంది. ఈ క్రమంలో ఏపీ బీజేపీ ఎంపీలు ఇవాళ కేంద్రానికి మరో ప్రతిపాదన సమర్పించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు గత మోడీ ప్రభుత్వం చురుగ్గా పావులు కదిపింది. అదే సమయంలో విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం ఉద్యమాలు జరగడం, ఎన్నికల సమయం కూడా రావడంతో దీన్ని తాత్కాలికంగా పక్కనబెట్టింది. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో దీనిపై కేంద్రం ఏం చేయబోతోందన్న టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ఏ నిర్ణయం ఉండదంటూ గుడ్ న్యూస్ చెప్పారు.

ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి అయిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి కేంద్ర ఉక్కు మంత్రి హెచ్ డీ కుమారస్వామిని కలిశారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు బదులుగా సెయిల్ లో విలీనం చేసి బలోపేతం చేయాలని వారు ప్రతిపాదించారు. స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టాలంటే ఇది అత్యవసరమని కుమారస్వామికి తెలిపారు. దీనిపై స్పందించిన కుమారస్వామి.. బీజేపీ ఎంపీల ప్రతిపాదనపై మరో సమావేశం పెట్టుకుని చర్చిద్దామని తెలిపారు.













Click it and Unblock the Notifications