అచ్చెన్నాయుడు పై సీఎం జగన్ సీరియస్ - అదేనా చేసేది : 25 వరకు అసెంబ్లీ..!!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే కీలక పరిణమాలు చోటు చేసుకున్నాయి. బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి టీడీపీ నేత అచ్చెన్నాయుడు పైన సీరియస్ అయ్యారు. ఈ ఉదయం బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. గో బ్యాక్ గవర్నర్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేసారు. ఆయన ప్రసంగానికి సంబంధించిన ప్రతులను చింపి వేసారు.
Recommended Video

బీఏసీ సమావేశంలో సీఎం సీరియస్
అచ్చెన్నాయుడు తన స్థానంలోనే నిలబడి గవర్నర్ ప్రసంగం ప్రతులను చింపగా.. సభ్యులు పోడియం ముందు కాపీలను చింపుతూ నినాదాలు కొనసాగించారు. ఇక, గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత బీఏసీ సమావేశం జరిగింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వం నుంచి సీఎం జగన్, మంత్రులు బుగ్గన, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ హాజరు కాగా, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఆ సమయంలో సీఎం జగన్ అచ్చెన్నకు క్లాస్ తీసుకున్నారు. గవర్నర్ ను గోబ్యాక్ అంటూ నినాదాలు ఏంటని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించి గవర్నర్‌పై విసిరేయడంపైన సీరియస్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంపై మంచి పద్ధతి కాదని అచ్చెన్నాయుడికి సీఎం జగన్ హితవు పలికారు.

అచ్చెన్నాయుడుకు సభలో తీరు పైన క్లాస్
గతంలో ఇలాంటి సంస్కృతి ఎన్నడూ లేదనే సంగతిని సీఎం జగన్ గుర్తుచేశారు. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని.. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తితో అదే నా వ్యవహిరించే తీరు అంటూ ప్రశ్నించారు. గవర్నర్ వయసులో పెద్దవారని, ఆయనకు మనం గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. అచ్చెన్నాయుడు దీనికి సమాధానం ఇవ్వబోగా.. మంత్రులు సైతం టీడీపీ తీరును ఖండించారు. ఇక, టీడీపీ నుంచి ఏ అంశం ప్రస్తావించినా.. సరైన విధానంలో ముందుకు వస్తే చర్చకు సిద్దమని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీడీపీ నుంచి 20 అంశాలకు సంబంధించి చర్చకు అవకాశం ఇవ్వాలని అచ్చెన్న ప్రతిపాదించారు. వైసీపీ నుంచి పలు అంశాలు చర్చకు ఉన్నాయని స్పీకర్ మంత్రులు వివరించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు అంశాన్ని మంత్రులు వివరించారు.

13 వర్కింగ్ డేస్ లో ఏపీ అసెంబ్లీ
ఇక, ఈ నెల 25వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 13 పని దినాల్లో అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ నెల 11వ తేదీన సభలో 2022-23 వార్షిక బడ్జెట్ ను మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టనున్నారు. 8వ తేదీన దివంగత మంత్రి గౌతమ్ రెడ్డికి సభ నివాళి అర్పించనుంది. ఇక, 9,10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పైన చర్చ..ముఖ్యమంత్రి సమాధానం ఉండనున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి బడ్జెట్ పైన చర్చ ప్రారంభం కానుంది. అదే సమయంలో రాజకీయ అంశాల పైన స్వల్ప కాలిక చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. నిర్వహణ.. లబ్ది వంటి అంశాల పైన సభలో వివరించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.












Click it and Unblock the Notifications