పోలవరం నిర్వాసితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... కేబినెట్‌లో కీలక నిర్ణయం...
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ.550 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్ ప్లస్ ఏర్పాటు,అగస్టులో అమలుచేయాల్సిన నవరత్నాలపై కేబినెట్‌లో చర్చ జరుగుతోంది.ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తాజా కేబినెట్ భేటీ ప్రస్తుతం కొనసాగుతోంది.తాజా భేటీలో ఈ నెల 10 నుంచి అమలు చేయనున్న 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' పథకంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్న పథకాలు,కార్యక్రమాలు :
అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం.
ధార్మిక పరిషత్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలపవచ్చు.
రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
మచిలీపట్నం, భావనపాడు పోర్టుల సవరించిన అంచనాలను కేబినెట్ ఆమోదించవచ్చు.
బుడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం.
కర్నూలుకు లోకాయుక్త తరలింపు ప్రతిపాదన, అక్కడే హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.

పోలవరం నిర్వాసితులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అఖిలపక్షం,పోలవరం నిర్వాసితుల కమిటీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. నిర్వాసితులను ఏపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. పునరావాసం, ప్యాకేజీ ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం బాధితులను బలవంతంగా తరలిస్తోందని ఆరోపించారు.
పోలీసు, రెవెన్యూ అధికారుల బెదిరింపులతో నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు కేంద్ర దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.తక్షణ సాయం కింద నిర్వాసిత కుటుంబాలకు నెలకు రూ.7500 చొప్పున 3 నెలల పాటు అందించాలని డిమాండ్ చేశారు.టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు,కేశినేని నాని,కనమేడల రవీంద్ర కుమార్,సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications