ఎన్నికల వేళ మరో కీలక నిర్ణయం - 20 ఏళ్లు దాటితే చాలు, అమరావతి పైనా...!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారాలు చూపిన మంత్రివర్గం..ఇప్పుడు ఉద్యోగాల భర్తీ..అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ..మూడు రాజధానుల వ్యవహారం..కొత్త లబ్దిదారులకు పథకాల అమలు పైన కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ పైన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు..దుమారం పైనా చర్చ జరిగే అవకాశం ఉంది.
నేడు మంత్రివర్గ సమావేశం:ఏపీ సచివాలయంలో ఈ రోజు (బుధవారం) ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పెండింగ్ నిర్ణయాల అమలుతో పాటుగా..అన్ని వర్గాలకు మరింతగా దగ్గరయ్యే కీలక నిర్ణయా ల పైన చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధానితో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చ కు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో కీలకమైనవి సీఎం తన మంత్రివర్గ సహచరులకు వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో, పాటుగా ప్రభుత్వం ఈ సారి సమావేశంలో ఉద్యోగాల భర్తీ పైన ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయని సమాచారం. డీఎస్సీతో పాటుగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ:ఈ సమావేశంలో అసైన్డ్ భూములు యాజమాన్య హక్కుల పైన మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ భూములు కేటాయించి 20 ఏళ్లు పూర్తయితే అమ్ముకొనే హక్కు కల్పించేలా మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 1.60 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములను 22(ఏ) నుంచి తొలిగించేందుకు ఆమోదం తెలపేందుకు ఫైల్ సిద్దమైంది. 1,700 దళిత వాడల్లో శ్మశాన వాటికలకు వెయ్యి ఎకరాలు కేటాయిస్తూ మరో నిర్ణయం తీసుకోనున్నారు. తమకు కేటాయించిన అసైన్డ్ భూములను అమ్ముకొనేందుకు హక్కు కల్పించాలని పలు జిల్లాల్లో రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే 22(ఏ) కింద ఉన్న సాగు భూములకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇప్పుడు అసైన్డ్ భూముల పైన నిర్ణయం తీసుకోనుంది.
పవన్ వ్యాఖ్యలు..మూడు రాజధానులు:అమరావతి కేసు విచారణను సుప్రీంకోర్టు తాజాగా డిసెంబర్ కు వాయిదా వేసింది. అత్యవసరంగా విచారించని ఏపీ ప్రభుత్వం కోరినా..సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ లో తాను విశాఖకు మకాం మారుస్తానని గతంలోనే సీఎం ప్రకటించారు. దీనికి సంబంధించి ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ మంత్రులకు స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు. గత కేబినెట్ సమావేశంలో పీఆర్సీ అధ్యయన కమిటీ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలపటంతో..ఈ సమావేశంలో అధికారి నియామకం పైన నిర్ణయం తీసుకోనున్నారు. అదే విధంగా వాలంటీర్ల వ్యవస్థ పైన పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు..రాజకీయ కోణం.. స్పందించే విధానంపైన సీఎం జగన్ మంత్రులకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది. జగనన్న సురక్ష పైన సమీక్ష చేయనున్నారు.












Click it and Unblock the Notifications