వాలంటీర్లు, సచివాలయాల నిర్వహణలో కీలక మలుపు..!!
ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల పై విధాన పరమైన నిర్ణయం ప్రకటనకు సిద్దమైంది. అదే విధంగా సచివాలయాల ప్రక్షాళన కు నిర్ణయించింది. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ ఖరారు తో పాటుగా మిగిలిన పాలసీ ల ఖరారు పైన వేగంగా అడుగులు వేస్తోంది. అదే విధంగా పాలనా పరంగా కీలక నిర్ణయాల కోసం ఈ నెల 23 న ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. వచ్చే నెలలో బడ్జెట్ ప్రతిపాదనకు వీలుగా అసెంబ్లీ సమావేశాల పై నిర్ణయం తీసుకోనుంది.
వాలంటీర్ల అంశం
ఏపీ మంత్రివర్గం మరో కీలక నిర్ణయానికి సిద్దం అవుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన సమావేశం లో ఆరు పాలసీలకు ఆమోదం తెలిపారు. ఈ నెల 23న జరిగే సమావేశంలో దేవాదాయ శాఖలో తీసుకొచ్చే కొత్త మార్పుల పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లకు పది వేలు గౌరవ వేతనంగా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే, నాలుగు నెలలుగా వారికి వేతనాలు లేవు. ఉద్యోగాల కొనసాగింపు పైన స్పష్టత లేదు. ఈ సారి జరిగే మంత్రివర్గ సమావేశంలో విధుల్లోకి తీసుకునే వాలంటీర్ల సంఖ్య తో పాటుగా వారికి స్కిల్ శిక్షణ.. విధుల ఖరారు పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రక్షాళన
సచివాలయాల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సచివాలయాల నిర్వహణ మొత్తం పంచాయితీలతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా గ్రామాల్లోని జనాభా ఆధారంగా సచివాలయాలను కొనసాగించాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ప్రతీ గ్రామంలోని సచివాలయం గ్రామ పంచాయితీ పరిధిలోనే విధులు నిర్వహించేలా చూడాలనే ప్రతిపాదన పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఉద్యోగుల సర్దుబాటు.. ఎక్కువ మంది సిబ్బంది ఉన్న చోట వారిని ప్రభుత్వ శాఖలకు బదిలీ పైన మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వం కసరత్తు
ఏపీ ప్రభుత్వం తొమ్మిది పాలసీలకు ఆమోదం తెలపాలని భావించింది. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గంలో ఆరు పాలసీలకు ఆమోదం తెలిపారు. మిగిలిన మూడు పాలసీలతో పాటుగా సూపర్ సిక్స్ పథకాల అమలు పైన చర్చించనున్నారు. దీపావళి నుంచి ప్రారంభించే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం విధి విధానాలు ఖరారు చేయనున్నారు. వచ్చే నెల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల పైన నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications