కేంద్రంలో కీలక పరిణామాలు, కొత్త లెక్కలు - మంత్రులతో సీఎం జగన్ భేటీ..!!
ఏపీ మంత్రివర్గ కీలక సమావేశం ఈ రోజు జరగనుంది. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో పట్టు పెంచుకొనే విధంగా పాలనా వ్యవహారాల్లో..పార్టీ పరంగా కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ఈ సమావేశంలో ఆసక్తి కర నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది.
ఏపీ మంత్రివర్గ సమావేశం:ఏపీ మంత్రివర్గం ఈ రోజు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సవరించిన నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అదే విధంగా సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ అంశంలో గతంలోనే కేబినెట్ ఆమోదం తెలిపినా.. ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న అభ్యర్ధనలతో మరోసారి చర్చించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభార పరిస్థితులు... భవిష్యత్ ప్రణాళిక పైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, పారిశ్రామిక అనుమతులతో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయని తెలుస్తోంది. ఈ సారి సమావేశంలో పాలనా పరమైన అంశాలతో పాటుగా రాజకీయ అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు.

కేంద్రంలో పరిణామాలపై చర్చ:కేంద్రంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఈ బిల్లును స్వాగతించారు. పార్లమెంట్ లో ఆమోదం లభిస్తే రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ బిల్లు పైన చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం జగన్ ఇప్పటికే మహిళలకు పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా..పదవుల్లోనూ అమలు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్ సాంకేతికంగా తాజా బిల్లు ద్వారా సాధ్యం కాదనే అభిప్రాయం ఉన్నా..రిజర్వేషన్లు అమలు విషయంలో సీఎం జగన్ పార్టీ పరంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్రం తీసుకొచ్చే ఇతర బిల్లుల అంశంలోనూ వైసీపీ వైఖరి పైన ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది.

రేపటి నుంచి అసెంబ్లీ:రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వైసీపీకి రాజకీయంగా ప్రాధాన్యత కలిగినవి. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులకు నేటి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే విధంగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు..కేసు అంశాలను అధికారులు ఈ కేబినెట్ లో మంత్రులకు వివరించే అవకాశం ఉంది.
అదే విధంగా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ కక్ష్య సాధింపు కాదని..నేరం చేస్తే శిక్ష పడిందని చెప్పేందుకు సిద్దం అవుతున్నారు. అదే విధంగా సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ కేబినెట్ లో రాజకీయంగానూ అమలు చేసే వ్యూహాలపైన చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications