విశాఖలో రాజధానుల టెన్షన్-అమరావతి వర్సెస్ త్రీ క్యాపిటల్స్-పైచేయి కోసం ఎత్తుకు పైఎత్తులు !
ఏపీలో రాజధాని రాజకీయాలు పతాకస్దాయికి చేరుకున్నాయి. ఇన్నాళ్లూ అమరావతి రాజధానిని మాత్రమే వ్యతిరేకిస్తూ హైకోర్టు తీర్పు తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించిన వైసీపీ సర్కార్ ఇప్పుడు మరోసారి మూడు రాజధానుల జూలు విదిలిస్తోంది. ముఖ్యంగా రేపు ప్రధాన రాజధాని కాబోతున్న విశాఖలో జనాన్ని మూడు రాజధానుల దిశగా నడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ సర్కార్ ఈ నెల15న విశాఖలో రాజధానుల గర్జన ఏర్పాటు చేసింది. అమరావతి పాదయాత్ర విశాఖ జిల్లాలో అడుగుపెట్టక ముందే దీన్ని పూర్తి చేసేందుకు సిద్ధమైంది.

అమరావతి వర్సెస్ రాజధానులు
ఏపీలో రాజధానిగా అమరావతి ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్న దానిపై రాష్ట్రంలో పతాకస్దాయిలో చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చినా వాటిని న్యాయపరంగా సాధించుకోవడంలో విఫలమైన వైసీపీ సర్కారే అన్నది మెజారిటీ వినిపిస్తున్న అభిప్రాయం. అయితే అదే సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమరావతే రాజధానిగా ఉండాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఈ మొత్తం వ్యవహారాన్ని వేడెక్కిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజధాని రాజకీయాలు ఎన్నడూ లేనంత పొలిటికల్ హీట్ ను రాజేస్తున్నాయి.

అమరావతి పాదయాత్రతో
అమరావతిలోనే రాజధాని ఉంచాలని కోరుతూ స్ధానిక గ్రామాల రైతులు అరసవిల్లికి పాదయాత్ర ప్రారంభించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా హైకోర్టు సాయంతో అనుమతి తెచ్చుకుని యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర ఇప్పటివరకూ విజయవంతంగానే కొనసాగుతోంది. దీంతో విశాఖలోనూ ఈ యాత్ర విజయవంతమైతే తమ మూడు రాజధానులకు ప్రజల మద్దతు లేదని విపక్షాలు ప్రచారం చేస్తాయన్న భయం వైసీపీని వెంటాడుతోంది. ఇప్పటికే విపక్షాలు అమరావతే రాజధానిగా ఉండాలనే అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తున్న తరుణంలో అధికార పార్టీకి ఇది సంకటంగా మారింది. దీంతో హడావిడిగా నాన్-పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి మూడు రాజధానులపై జనానికి అవగాహన కల్పించే పనిలో పడింది.

విశాఖలో గర్జనతో వైసీపీ సమాధానం
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర విశాఖకు చేరే లోపు ఓ భారీ కార్యక్రమం ప్లాన్ చేయడం ద్వారా ప్రజల్లో దీనిపై వ్యతిరేకత పెంచాలనేది వైసీపీ వ్యూహం. ఇందులో భాగంగా ఏర్పాటైన నాన్-పొలిటికల్ జేఏసీ.. ఈ నెల 15న విశాఖలో గర్జనకు పిలుపునివ్వడం, దాన్ని వైసీపీ ఓన్ చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు వైసీపీ మంత్రులంతా విశాఖ గర్జను విజయవంతం చేయడం ద్వారా విశాఖ రాజధానికి మద్దతివ్వాలని అందరినీ కోరుతున్నారు. భారీ సంఖ్యలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులకు తోడు అధికార పార్టీగా జనాన్ని భారీగా తరలించగల సత్తాను వాడుకుని ఈ గర్జనను విజయవంతం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. దీంతో విశాఖలో 15న జరిగే గర్జన వైసీపీ మూడు రాజధానుల బలపరీక్షగా మారిపోతోంది.

బలపరీక్షలపై విశాఖలో ఉత్కంఠ ?
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో సాగుతున్న అమరావతి పాదయాత్ర విశాఖకు రాకముందే వైసీపీ మూడు రాజధానుల గర్జన ఏర్పాటు చేస్తోంది. అమరావతి రైతుల కంటే ముందు తామే ముందు జనంలోకి వెళ్లి మూడు రాజధానులపై సెంటిమెంట్ రెచ్చగొట్టాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా విశాఖలో చోటు చేసుకోబోయే తదుపరి పరిణామాల్లో అటు విపక్షాల మద్దతున్న అమరావతి రైతులు కానీ,ఇటు ఒంటరిగా పోరాడుతున్న అధికార పార్టీ వైసీపీ కానీ ఈ వ్యవహారాన్ని చాలా సున్నితంగా డీల్ చేయాల్సి ఉంది. ఇందులో వీరు విఫలమైతే మాత్రం కచ్చితంగా విశాఖ వేదికగా భారీ రాజకీయ పోరాటాలు, హింస కూడా చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. దీంతో ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటూ అప్రమత్తంగా ఉంటోంది.












Click it and Unblock the Notifications