చంద్రబాబును మళ్లీ కస్టడీ కోరిన సీఐడీ-సీల్డ్ కవర్లో రిపోర్ట్-బెయిల్ వేళ..!
ఏపీలో టీడీపీ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు సంబంధించి మాజీ సీఎం చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వాలని సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టును కోరింది. తాజాగా రెండు రోజుల పాటు చంద్రబాబును ఇదే కేసులో రాజమండ్రి జైల్లో విచారించిన సీఐడీ.. మరోసారి విచారణ చేయాలని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టి ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏసీబీ కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు చంద్రబాబును రాజమండ్రి జైల్లో కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సీఐడీ అధికారులు పలు విషయాలు రాబట్టారు. అయితే చంద్రబాబు ఈ విచారణలో పూర్తిగా సహకరించలేదని సీఐడీ అధికారులు ఆయన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రెండు రోజుల కస్టడీ విచారణలో రాబట్టిన అంశాలను కూడా కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్ లో సమర్పించారు.
ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈసారి ఐదు రోజుల కస్టడీకి చంద్రబాబును ఇవ్వాలని వారు ఏసీబీ కోర్టును కోరారు. దీంతో కోర్టు చంద్రబాబును రెండోసారి కస్టడీకి ఇచ్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అదే సమయంలో సుప్రీంకోర్టులోనూ క్వాష్ పిటిషన్ రేపు విచారణకు రావాల్సి ఉంది.
ఇప్పటికే సీఐడీ అధికారులు చంద్రబాబు ఈ కేసులో సాక్ష్యుల్ని , ఇతర నిందితుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ కోర్టుకు తెలిపిన నేపథ్యంలో బెయిల్ ఇవ్వొద్దని కోరారు. అలాగే కస్టడీ విషయంలో చంద్రబాబు లాయర్లు దాఖలు చేసే అఫిడవిట్, వాదనల ఆధారంగా ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రేపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ జరిగే అవకాశం ఉంటే మాత్రం ఏసీబీ కోర్టు కస్టడీపై విచారణ జరిపి నిర్ణయం వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications