తప్పుడు లెక్కలు: కెసిఆర్‌పై బాబు, టి నేతలకు ప్రశంస
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఆయన బుధవారం తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విభజన చట్టంతో పాటు పలు సమస్యలపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ విషయంలో తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు చెప్పేవన్ని తప్పుడు లెక్కలేనని ఆరోపించారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
విభజన చట్టం విషయంలో తెలంగాణ సర్కారు తీరును ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై పోరాటం చేస్తున్న తెలంగాణ టిడిపి నేతలను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. మరింతగా పోరాటం చేయాలని వారికి సూచించారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 7 ముంపు మండలాల ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఏపి సిఎం చంద్రబాబును ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ముంపు మండలాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
21న ఢిల్లీకి బాబు
ఏపి సిఎం చంద్రబాబునాయుడు నవంబర్ 21న ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర సమస్యలపై ఆయన కేంద్రమంత్రులను కలువనున్నారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, ఉమాభారతి, సురేష్ ప్రభులతో చంద్రబాబు భేటీకానున్నట్లు సమాచారం.
గవర్నర్‌తో భేటీ: ఇంటర్ పరీక్షలపై రాని స్పష్టత
ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ, ఏపి విద్యాశాఖ మంత్రులు జగదీశ్ రెడ్డి, గంటా శ్రీనివాస రావు గవర్నర్ నర్సింహన్‌తో బుధవారం సమావేశమయ్యారు. అయితే భేటీలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై స్పష్టత రాలేదు. గవర్నర్ ముందు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు తమ వాదనలను వినిపించారు.
విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల మంత్రులకు గవర్నర్ సూచించారు. కాగా, వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే ఏపి విద్యార్థులు నష్టపోతారని గంటా శ్రీనివాస్ తెలిపారు.
ఏపి సిఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఇంటర్ పరీక్షల నిర్వహణపై నిర్ణయం ప్రకటిస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. విభజన చట్టం ప్రకారం పరీక్షలు సొంతంగానే నిర్వహించుకుంటామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications