ఏపీలో వారికి నెలకు రూ.10వేలు, రూ.5వేలు.. ప్రకటించిన చంద్రబాబు
నారా చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అన్నింటినీ ఒకేసారి నెరవేర్చడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రకటించిన మరో హామీని తాజాగా ఆయన నిలబెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం రూ.5వేల ఆదాయం కూడా లేని మసీదుల్లోని మౌజన్లు, ఇమామ్లకు గౌరవ వేతనాన్ని పెంచింది. ఇమామ్లకు నెలకు రూ.10వేలు, మౌజన్లకు నెలకు రూ.5వేలు ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
జగన్ పై మండిపడ్డ ఫరూఖ్
ఏప్రిల్ నెల నుంచి ఈ నిర్ణయం అమలయ్యేలా ఉత్తర్వులు జారీచేశారు. వీరి వేతనాల కోసం బడ్జెట్ లో ఏడాదికి రూ.90 కోట్లు కేటాయించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందంటూ మైనార్టీ, సంక్షేమశాఖ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూఖ్ మండిపడ్డారు. ఓట్ల కోసం ఉపయోగించుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోలేదని, ఓటుబ్యాంకుగా చూశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మైనార్టీలకు అధిక ప్రాధాన్యత దక్కుతోందని, సంక్షేమ పథకాల్లో వారికే అగ్ర తాంబూలం లభిస్తోందని మంత్రి వెల్లడించారు.

చంద్రబాబును కలిసిన అజీజ్
అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కలిశారు. కూటమి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకువచ్చేలా అజీజ్ పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఆయన తర్వాత మంత్రులు రామనారాయణరెడ్డి, నారాయణ, ఫరూఖ్ తో కూడా అజీజ్ భేటీ అయి వక్ఫ్ బోర్డు నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. మైనార్టీలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, వారికి ఏ అవసరం వచ్చినా వక్ప్ బోర్డు ద్వారా తక్షణమే సహాయం అందుతుందని మంత్రి నారాయణ అన్నారు.












Click it and Unblock the Notifications