ఏక్‌నాథ్ షిండేతోనే ఎందుకు చంద్రబాబు మంతనాలు?
Chandrababu Naidu: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ రిసెప్షన్ శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం.. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా ముగిసింది.
నూతన వధూవరులను ఆశీర్వదించడానికి దేశ, విదేశాల నుంచి రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు, క్రికెటర్లు దీనికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొన్నారు. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, విక్టరీ వెంకటేష్, రామ్‌చరణ్ దంపతులు.. తళుక్కుమంటూ మెరిశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఈ శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ముఖేష్ అంబానీ- నీతా అంబానీ వారికి ఘనస్వాగతం పలికారు. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరికొందరు సహచర మంత్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజాగా- చంద్రబాబు నాయుడు.. కొద్దిసేపటి కిందటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సమావేశం అయ్యారు. కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి ఏక్‌నాథ్ షిండే నివాసానికి వెళ్లారు. వారికి సాదర స్వాగతం లభించిందక్కడ. షిండే, ఆయన తనయుడు కల్యాణ్ లోక్‌సభ సభ్యుడు శ్రీకాంత్ షిండే, మరికొందరు శివసేన చీలికవర్గ నాయకులు చంద్రబాబును కలిశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో టీడీపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం భాగస్వామ్యపార్టీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఏక్‌నాథ్ షిండేతో సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.
ఈ భేటీకి సంబంధించిన వివరాలను ఏక్‌నాథ్ షిండే తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సుదీర్ఘకాలం పాటు తమ ఈ రెండు రాష్ట్రాల మద్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, వాటిని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. చంద్రబాబుకు అపార రాజకీయ అనుభవం ఉందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications