చంద్రబాబు-పవన్ కల్యాణ్ పొత్తును YCPకి 'విజయం'గా మారుస్తున్న జగన్?
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దృఢనిశ్చయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రజలకు తాను అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సాధించి పెడతాయనే నమ్మకంతో ఉన్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థలన్నింటిలోను విజయం సాధించడం ప్లస్ పాయింట్ గా మారింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీచేస్తాయంటూ వార్తలు వస్తున్నాయి. దీనివల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు అడుగంటుతాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

పూర్తి నమ్మకంతో ముఖ్యమంత్రి
అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం 100కు 100 శాతం పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఐప్యాక్ ద్వారా ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహింపచేయిస్తూ, ఎక్కడ లోపాలుంటే అక్కడ సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే అభ్యర్థుల ఎంపిక కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దాదాపుగా గెలుపు గుర్రాలనే పోటీకి నిలపాలని జగన్ తలపోస్తున్నారు. సర్వేలో నెగెటివ్ మార్కులు రావడం, పనితీరు బాగోలేకపోవడం, ప్రజలతో మమేకమవకపోవడం లాంటి కారణాలతో కొంతమందిని మార్చి కొత్త ముఖాలను తీసుకురావాలని యోచిస్తున్నారు.

చివరి నిముషంలోనైనా టీడీపీ-జనసేన పొత్తు?
తెలుగుదేశం, జనసేన చివరి నిముషంలోనైా పొత్తు పెట్టుకుంటాయని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. దీనివల్ల తమకే మంచిదంటూ విశ్లేషణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అందరూ ఒక్కరయ్యారంటూ ప్రచారం చేయాలని నిర్ణయించారు. బీజేపీ కలవకుండా ఉంటే సీపీఐ, సీపీఎం, బీఎస్పీ లాంటి పార్టీలు కూడా టీడీపీ-జనసేన తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. ఇది తమకు సానుభూతిని కలగజేస్తోందని, అందరూ అనుకున్నట్లుగా ఇబ్బందులు కాకుండా అనుకూలతే ఉంటుందని వైసీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

ఒంటరివాణ్ని చేస్తున్నారంటూ ప్రచారం..
ఇప్పటికే ప్రజల్లోకి ఈ ప్రచారం వెళ్లిపోయిందని, ఒంటరివాణ్ని చేసి అందరూ కలిసికట్టుగా కూటమికట్టి ఓటమిపాలు చేయాలని చూస్తున్నారని, అంతేకాకుండా వీరు వస్తే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే మీమాంశ కూడా ఓటర్లు వైసీపీవైపు మొగ్గుచూపడానికి కారణాలవుతున్నాయని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications