హిందూపురం to ఇచ్ఛాపురం వయా అద్దంకి, రాజమండ్రి: వైఎస్ జగన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2024లో జరగబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసి రెండోసారి కూడా అధికారాన్నిచేపట్టాలనే పట్టుదలతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు కొరకుడు పడని నియోజకవర్గాలపై దృష్టిసారించింది. గత ఎన్నికల్లో పార్టీ హవా వీయడంతో తిరుగులేని మెజారిటీతో సాధికారికంగా 151 సీట్లను కైవసం చేసుకోగలిగింది. కానీ ఈసారి అన్ని సీట్లు రాకపోయినా మెజారిటీకి అవసరమైన సీట్లు మాత్రం సాధిస్తామనే ధీమాను ఆ పార్టీ అధిష్టానం వ్యక్తపరుస్తోంది.

ఆ 23 వైసీపీ పరం కావాలి!
ఎన్నికల ప్రణాళికలో భాగంగా నియోజకవర్గాలవారీగా పార్టీ బలాబలాలను పరిశీలించుకుంటూ వస్తున్న వైసీపీకి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందిన నియోజకవర్గాల్లో మాత్రం పట్టుదొరకడంలేదనే భావన వ్యక్తమవుతోంది. 23 నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించగా అందులో గుంటూరు పశ్చిమ, చీరాల, గన్నవరం, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. ఇక టీడీపీకి మిగిలింది 19 మంది ఎమ్మెల్యేలు.

19 నియోజకవర్గాలు!
ఈ 19 మంది ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు కుప్పం, హిందూపుం, విజయవాడ తూర్పు, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం పశ్చిమం, అద్దంకి, ఉండి, పర్చూరు, రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, మండపేట, పెద్దాపురం, పాలకొల్లు, టెక్కలి, ఇచ్చాపురం, ఉరవకొండ, కొండెపి, రేపల్లె,

బలంలో మార్పు లేదు?
ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంలో మార్పు రాలేదనే అంచనా వ్యక్తమవుతోంది. అయితే స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీతో సహా ఈ నియోజకవర్గాల పరిధిలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గాలను ఎలాగైనా వైసీపీ పరం చేయాలని ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గాల పరిధిలో బలమైన స్థానిక నేతలను వైసీపీలోకి ఆహ్వానించారు. ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే ఈ నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ ఇన్‌ఛార్జిలు కూడా బలహీనంగా కనపడుతున్నారు. వీరు తమ పరిధిని దాటి వైసీపీ బలాన్ని పెంచలేకపోతున్నట్లు ఆ పార్టీ ఇటీవల నిర్వహించుకున్న సర్వేల్లో వెల్లడైనట్లు సమాచారం. వాటిల్లో గెలుపొందాలంటే జగన్ ఎటువంటి వ్యూహం అవలంబిస్తారో వేచిచూడాల్సి ఉంది.!!












Click it and Unblock the Notifications