జేఈఈ అడ్వాన్స్‌డ్ డేటా లీక్..! ఏకంగా 1.79 లక్షల రికార్డులు-ఐఐటీ రూర్కీ షాక్..!
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 (JEE Advanced) ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే, ఐఐటీ రూర్కీ డేటా లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు ఐఐటీ రూర్కీ డేటా లీక్ (IIT Roorkee Data Breach)ను అంగీకరించింది. అభ్యర్థుల రికార్డులు, అడ్మిట్ కార్డ్ డాక్యుమెంట్లు లీక్ అయినట్లు వెల్లడైంది. ఫలితాల మౌలిక సదుపాయాల్లో ఉపయోగించిన క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లోపం వల్లే ఇది జరిగిందని ఐఐటీ తెలిపింది. ఈ లోపాన్ని సరిదిద్దే పనులు జరుగుతున్నాయని పేర్కొంది.
ఈ డేటా లీక్ ఘటన ఓ సైబర్‌సెక్యూరిటీ పరిశోధకుడు ఎక్స్ లో చేసిన పోస్ట్ తో వెలుగులోకి వచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల వ్యవస్థకు సంబంధించిన పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్‌ను ధృవీకరణ (authentication) లేకుండానే యాక్సెస్ చేయడానికి వీలుగా కాన్ఫిగర్ చేసినట్లు ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ లోపంతో సుమారు 1,79,600 ఫలితాల రికార్డులు, 1,87,300 అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్ లు బహిర్గతమయ్యాయి. అభ్యర్థుల పేర్లు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్‌లతో సహా వ్యక్తిగత వివరాలు ఈ డేటాలో ఉన్నాయని వెల్లడైంది. షేర్ చేసిన స్క్రీన్‌షాట్లలో అడ్మిట్ కార్డ్ పత్రాలు, సబ్జెక్టుల వారీగా మార్కులు, ర్యాంకులు వంటి ఫలితాల డేటా స్పష్టంగా కనిపించింది.

ఈ ఘటనపై ఐఐటీ రూర్కీ వెంటనే ఎక్స్ వేదికగా స్పందించింది. "@DarthKermy72747 క్లౌడ్ స్టోరేజ్ డివైస్‌లో కాన్ఫిగరేషన్ సమస్యను సూచించినందుకు ధన్యవాదాలు అని తెలిపింది. ఈ విషయాన్ని ప్రాధాన్య ప్రాతిపదికన పరిష్కరిస్తున్నామని ట్వీట్ చేసింది. స్టోర్ చేసిన డేటా 'రీడ్-ఓన్లీ' ఫార్మాట్‌లో ఉంది, కాబట్టి ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. "డేటా రీడ్-ఓన్లీగా ఉన్నందున, ఎటువంటి మార్పులకు అవకాశం లేదు. మీ బాధ్యతాయుతమైన, నైతిక ప్రవర్తనను అభినందిస్తున్నామని ఐఐటీ రూర్కీ పేర్కొంది. ఈ వారంలోనే ఐఐటీ రూర్కీ, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలను విడుదల చేసింది. ఐఐటీలలో అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష కీలకం. ఈ లోపం గతంలో సీబీఎస్‌ఈ ఆన్సర్ స్క్రిప్ట్‌ల లీక్ ఘటన తరహాలోనే ఉందని పరిశోధకుడు అభిప్రాయపడ్డారు. అయితే, డేటా ఎంతకాలం అందుబాటులో ఉంది, ప్రభావిత అభ్యర్థులకు సమాచారం ఇచ్చారా అనే వివరాలు ఐఐటీ రూర్కీ వెల్లడించలేదు.












Click it and Unblock the Notifications