ఇదేం పాడు బుద్ధి నాయనా.. జపాన్‌లో పాక్‌కు ఘోర పరాభవం!
జపాన్ దేశంలో నిర్మించిన ఓ మసీదు ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వానికి, అక్కడ నివసిస్తున్న పాకిస్తానీ సమాజానికి తీవ్ర అవమానకరంగా మారింది. జపాన్‌లోని కావాగోయ్ నగరంలో నిర్మించిన ఈ మసీదును ఈ ఏడాది ఏప్రిల్‌లో జపాన్‌లోని పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ హమీద్ ఘనంగా ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఈ మసీదును కూల్చివేసే ప్రమాదం పొంచి ఉందని స్థానిక జపాన్ అధికారులు ప్రకటించారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా, చట్టవిరుద్ధంగా ఈ మసీదును నిర్మించడమే ఇందుకు కారణమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ మసీదు వివాదంపై కావాగోయ్ సిటీ హాల్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పట్టణ ప్రణాళిక చట్టం ప్రకారం ప్రత్యేక అనుమతులు ఉంటే తప్ప సాధారణంగా ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేని 'అర్బన్ డెవలప్‌మెంట్ కంట్రోల్ జోన్'లో ఈ మసీదును నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు. నగర పరిపాలన విభాగం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఈ భవనాన్ని లేపారని, ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయని, ఆ ప్రతిపాదనను తాము సమీక్షకు స్వీకరించామని సిటీ హాల్ పేర్కొంది.

మసీదు నిర్మాణం అక్రమమని తేలడంతో టోక్యోలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం తీవ్ర ఇరకాటంలో పడింది. వివాదం ముదరడంతో పాకిస్థాన్ రాయబార కార్యాలయం వెంటనే అలర్ట్ అయ్యి, ఆ మసీదు ప్రాజెక్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించి చేతులు దులిపేసుకుంది. జపాన్ చట్టాలను ఉల్లంఘించే ఎలాంటి ప్రాజెక్టులకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేస్తూ.. జపాన్‌లోని నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అక్కడ నివసిస్తున్న పాకిస్థాన్ సమాజానికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు జూన్ 1న టోక్యోలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం 'ఎక్స్' వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. జపాన్‌లో నివసిస్తున్న పాకిస్తానీయులు ముఖ్యంగా ప్రార్థనా స్థలాల నిర్మాణాల విషయంలో స్థానిక ప్రభుత్వాల నిబంధనలను, జపాన్ చట్టాలను తప్పకుండా పాటించాలని కోరింది. అవసరమైన అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని హెచ్చరించింది.
A mosque inaugurated in April in Japan's Kawagoe city in the presence of Pakistan's Ambassador to Japan, Abdul Hameed, is facing possible demolition after local authorities determined it was constructed without the permissions required under Japanese law.
— India Today Global (@ITGGlobal) June 3, 2026
Kawagoe City Hall said… pic.twitter.com/AgyROAThdw
అయితే పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ హమీద్ ఈ మసీదు ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దానిపై కూడా పాక్ రాయబార కార్యాలయం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్ 3, 2026న జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు.. జపాన్ చట్టాల ప్రకారం అన్ని అనుమతులు లభించాయని మసీదు నిర్వాహకులు రాయబారిని నమ్మించారని.. ఆ సమాచారం ప్రకారమే ఆయన ఆ కార్యక్రమానికి హాజరయ్యారని దౌత్య కార్యాలయం సమర్థించుకుంది. స్థానిక చట్టాలకు వ్యతిరేకంగా జరిగే ఇలాంటి ప్రాజెక్టులపై జపాన్ అధికారులకు పూర్తి సహకారం అందించాలని పాకిస్తాన్ రాయబార కార్యాలయం తమ దేశ ప్రజలకు గట్టిగా విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications