మహేష్ బాబు దగ్గరకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం హైదరాబాద్ వెళుతున్నారు. మృతి చెందిన సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. అనంతరం మహేష్ బాబుతోపాటు ఇతర కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పనున్నారు. శ్వాస సంబంధిత వ్యాధులతో కొన్నాళ్లుగా బాధపడుతున్న సూపర్ స్టార్ కృష్ణ మృతిచెందిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృష్ణకు వీరాభిమాని. ఏలూరులో ఎంపీగా పోటీచేసి ఓటమిపాలైన తర్వాత రాజకీయాలకు కృష్ణ దూరం జరిగారు. అయితే వైఎస్ కోరిక మేరకు 2009 ఎన్నికల్లో పరోక్షంగా మద్దతు పలికారు. కృష్ణ సినిమా రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తన స్వగ్రామం బుర్రిపాలెంను మర్చిపోలేదు. గ్రామానికి తరుచుగా రావడంతోపాటు కొన్ని సినిమాల షూటింగ్ లు అక్కడే జరిపేవారు. సంక్రాంతి పర్వదినం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి బుర్రిపాలెం వచ్చేవారు. సేవాగుణం కలిగిన కృష్ణ మృతితో బుర్రిపాలెంలో విషాదం నెలకొంది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు.

తెలుగు చలనచిత్ర రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ కథానాయకుడిగా కృష్ణ గుర్తింపు పొందారు. తొలి సినిమా స్కోప్ గా అల్లూరి సీతారామరాజును, తొలి 70 ఎంఎం చిత్రంగా సింహాసనం, తొలి డీటీఎస్ చిత్రంగా తెలుగువీర లేవరాతోపాటు అలాగే తొలి కౌబాయ్, తొలి జేమ్స్ బాండ్ క్యారెక్టర్లు పోషించారు. తాను కథానాయకుడిగా నటించిన సినిమా పరాజయం పాలైతే ఆ తర్వాత రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా సదరు నిర్మాతకు ఉచితంగా చిత్రం చేసేవారు. ఇటువంటి నిర్ణయంవల్ల కృష్ణ సేవాగుణం విశ్వవ్యాప్తమైంది.












Click it and Unblock the Notifications