రేవంత్ రెడ్డిపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
వచ్చే నెల 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రచారానికి తక్కువ సమయం మాత్రమే ఉండటంతో అన్ని ప్రధాన పార్టీలు విస్త్రతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో అతని చెల్లెలె వైఎస్ షర్మిల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె కడప లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
షర్మిల పోటీచేయడంపై వైఎస్ జగన్ స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ షర్మిల పోటీచేయడంపై తనకు బాధ లేదని, కానీ ఆమె డిపాజిట్ కోల్పోతుందనే బాధే ఎక్కువగా ఉందన్నారు. ఆమె చేస్తోంది సరైన చర్య కాదని, అక్రమ కేసుల ఛార్జిషీటులో తన పేరు, తన తండ్రి పేరు చేర్పించింది కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలేనని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తన చెల్లెలు, కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కడప లోక్ సభ నుంచి వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి బరిలో నిలవగా, అతనికి ప్రత్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల, తెలుగుదేశం పార్టీ నుంచి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి నిలిచారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులకు ఓటు వేయవద్దంటూ షర్మిలతోపాటు వివేకా కుమార్తె సునీత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటువంటి తరుణంలో కడప లోక్ సభతోపాటు పులివెందుల, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అవినాష్ రెడ్డి కచ్చితంగా గెలుస్తాడనే ధీమాతో సీఎం జగన్ ఉండగా, తామే గెలుస్తామని షర్మిల, భూపేష్ రెడ్డి భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications