పవన్ కళ్యాణ్ ఒక్కరే హీరోనా?: బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోనివ్వాలా? అంటూ నారాయణ స్వామి ఫైర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఈ విషయంలో ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తన పారితోషికంలో సగం డబ్బులను ప్రజల కోసం ఖర్చు చేయాలన్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాపైనే చంద్రబాబు ఎందుకు?: నారాయణస్వామి
జగనన్న తోడు పథకం కింద మూడో విడత సాయంగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్ మంగళవారం నగదు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందిస్తున్నారు? అఖండ, పుష్ప, బంగార్రాజు సినిమాలపై ఎందుకు స్పందించలేదు? అని నారాయణ స్వామి ప్రశ్నించారు. భీమ్లానాయక్ సినిమాపై చంద్రాబు అనవసర రాజకీయ చేస్తున్నారని మండిపడ్డారు

పవన్ కళ్యాణ్ సినిమా అయితే బ్లాక్‌లో టికెట్లు అమ్ముకోనివ్వాలా?
రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే ఇబ్బంది వచ్చిందా? పవన్ కళ్యాణ్ సినిమా అయితే బ్లాక్ లో టికెట్లు అమ్ముకోనివ్వాలా? అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నల వర్షం కురిపించారు. రూ. 50 కోట్లు, రూ. 100 కోట్లు తీసుకునే హీరోలు ప్రజలకు ఏమైనా సేవ చేస్తున్నారా? అని నిలదీశారు నారాయణస్వామి. పవన్ కళ్యాణ్ ఒక్కరే హీరో కాదు.. అందరూ హీరోలే.. అసలు హీరోల్లో ప్రజా సేవ చేసిన వాళ్లే లేరు. ప్రజానాయకుడు ప్రజా సేవకు ముందుకు రావాలి. పవన్ సినిమాకు రూ. 100 కోట్లు తీసుకుంటున్నారు. అలా అయితే అందులో సగం ప్రజల కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి నారాయణ స్వామి.
Recommended Video

త్వరలో చంద్రబాబు కూడా ఆ జాబితాలోకే: నారాయణస్వామి
డిప్యటీ సీఎం నారాయణ స్వామి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే దూషిస్తున్నారో వారంతా రాక్షస మనస్తత్వం కలిగినవారేనంటూ దుయ్యబట్టారు. జగన్ పై కేసులు పెట్టిన వారంతా రాజకీయంగా పతనమయ్యారని చెప్పారు. త్వరలో ఆ జాబితాలో చంద్రబాబు కూడా చేరతారని నారాయణస్వామి అన్నారు. తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచడంతోపాటు అదనపు ఆటలు వేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వగా.. ఏపీలో మాత్రం ఈ రెండింటికీ అనుమతి లేకపోవడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నేతలు కూడా ఏపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సినిమా టికెట్ల రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని సినిమా రంగంలోని మరో వర్గం భావిస్తోంది.












Click it and Unblock the Notifications