పవన్ కళ్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు 'అభినవ కృష్ణ దేవరాయ' అనే బిరుదును ప్రదానం చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని ఉడుపి పర్యటనలో ఉన్న ఆయనకు.. పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును అందజేశారు. మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పవన్ ఏమన్నారంటే..
ఏపీలో ఎన్నికలకు ముందు తాను కూడా అర్జునుడి లాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని పవన్ గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని విశ్వాసించి పొత్తుకు అంగీకరించానన్నారు. ధర్మాన్ని అనుసరించే కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యానని వివరించారు. ఈ కార్యక్రమానికి తాను డిప్యూటీ సీఎం గానో.. ప్రజాసేవకుడిగానో రాలేదని పవన్ వ్యాఖ్యానించారు. ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని వెల్లడించారు. సరైన పాలన, సేవ, బాధ్యతలతో కూడిన ప్రతి చర్యే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని వివరించారు.

భగవద్గీత అనేది ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంలో చుట్టి పూజాగదిలో ఉంచే గ్రంథం మాత్రమే కాదని పవన్ స్పష్టం చేశారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయం, ప్రతి గందరగోళం, ప్రతి అంతర్గత పోరాటంలో.. గీత మనతో పాటు నడుస్తూ, మన కురుక్షేత్రాల్లో స్థిరమైన మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. నేటి తరం యువత నిరంతరం సమాచార భారంతో.. కెరీర్ ఒత్తిడితో, గుర్తింపు సంక్షోభంతో, వైఫల్య భయాలతో పోరాడుతోందని, వారికి అత్యవసరమైన మానసిక బలం, భావోద్వేగ సమతుల్యత గీతలోనే దొరుకుతుందని వ్యాఖ్యానించారు.
మన కర్మభూమి శతాబ్దాలుగా అనేక దండయాత్రలను తట్టుకుని నిలవడానికి కారణం ఆయుధాలు, సంపదలు కాదని, ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాలు, సాధువులు, పవిత్ర సంస్థలేనని పవన్ గుర్తుచేశారు. ఐన్‌స్టీన్ నుంచి ఓపెన్‌హైమర్ వరకు అనేక మంది ప్రపంచ మేధావుల ఆలోచనలను గీత ప్రభావితం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఉడిపి వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఒకే చోట చేరినప్పుడు, ప్రాచీన భారతీయ తత్వమైన 'వసుధైవ కుటుంబకం' భావనకు ప్రత్యక్ష రూపం లభిస్తుందని పవన్ చెప్పారు. ఇదే ఆధ్యాత్మికత, ఇదే సమగ్రత నేడు భారతదేశం ప్రపంచానికి అందిస్తున్న అత్యంత విలువైన సందేశమని పేర్కొన్నారు. జగద్గురు మధ్వాచార్యుల శాశ్వత వారసత్వం మన ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడిందని, ఆ వారసత్వాన్ని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.
ఉడుపి క్షేత్రంలో శ్రీ కృష్ణుడిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. pic.twitter.com/b7Qet2HDrM
— JanaSena Party (@JanaSenaParty) December 7, 2025












Click it and Unblock the Notifications