ఏపీలో వారి బ్యాంక్ ఖాతాలలో పించన్ డబ్బులు.. త్వరలోనే కొత్త విధానం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీలో సామాజిక భద్రత పింఛన్లను అందుకుంటున్న దివ్యాంగ విద్యార్థుల విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది.
దివ్యాంగ విద్యార్థుల పింఛన్లపై చంద్రబాబు నిర్ణయం
ఏపీలో ప్రభుత్వం అందించే దివ్యాంగ విద్యార్థుల సామాజిక భద్రత పింఛన్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. చంద్రబాబు ఆమోదం తెలపడంతో రెండు మూడు నెలలలో అమల్లోకి వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పింఛన్ కోసం పాఠశాలలు, కళాశాలలకు లీవ్ పెట్టి వెళ్తున్న విద్యార్థులు
ప్రస్తుతం దివ్యాంగ విద్యార్థులు రెసిడెన్షియల్ కాలేజీలు, గురుకులాలు, హాస్టల్స్ లో ఉంటూ చదువును కొనసాగిస్తున్న వారు ఉన్నారు. ఈ దివ్యాంగ విద్యార్థులు పింఛన్ తీసుకోవాలంటే ప్రతి నెల వారి స్వగ్రామాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో వీరు పింఛన్ కోసం పాఠశాలలు, కళాశాలలకు లీవ్ పెట్టి మరి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల వీరు తరగతులను నష్టపోతున్నారు.
త్వరలోనే వీరికి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ
ఈ ఇబ్బందిని గుర్తించిన ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు దివ్యాంగ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పింఛన్ అందించే మార్గం చూడాలని, వారి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. దీంతో దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులు ఈ విధానం పైన ఫైల్స్ సిద్ధం చేసి సెర్ప్ అధికారులకు పంపారు. త్వరలోనే వీరికి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానున్నాయి.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద 7.50 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్
రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద 7.50 లక్షల మంది దివ్యాంగులు పింఛన్ పొందుతున్నారు. 45 శాతం వైకల్యం పైబడిన వారికి ఆరువేల రూపాయల నుండి 15 వేల రూపాయల వరకు పింఛన్ అందుతోంది. అయితే ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలలో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు వీరిలో 1400 మంది ఉన్నారు.
దివ్యాంగ విద్యార్థులకు లబ్ది
ప్రైవేట్ పిల్లలు స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులతో కలిపితే మొత్తం పదివేల మంది వరకు ఉన్నారు. ఈ విధానంతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమ చేయడం ద్వారా దివ్యాంగ విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలలో లీవ్ పెట్టి వెళ్లాల్సిన అవసరం ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.












Click it and Unblock the Notifications