చివరిరోజు ఏపీలో ఎవరెక్కడ..?
YS Jagan: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. సోమవారం రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు.
ఈ సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటోన్న స్థానికేతరులందరూ కూడా వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.

చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వేర్వేరు నియోజకవర్గాల్లో రోడ్ షోల్లో పాల్గొననున్నారు.
చివరిరోజున వైఎస్ జగన్ మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలను నిర్వహించనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడ ప్రసంగించిన అనంతరం ఏలూరు జిల్లా కైకలూరుకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కైకలూరు తాలూకా ఆఫీస్ సెంటర్‌లో జరిగే సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి వెళ్తారు. ఉప్పాడ బస్టాండ్ సెంటర్‌లో రోడ్ షోలో ప్రసంగిస్తారు జగన్. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తోన్న నియోజకవర్గం ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంగ గీతా బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నేడు నంద్యాలలో పర్యటించనున్నారు. రాజ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొంటారు. అనంతరం చిత్తూరుకు వెళ్తారు. 2 గంటలకు ప్రజా గళం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆయన తిరుమలకు వెళ్లే అవకాశం ఉంది.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రే పిఠాపురంలో రోడ్ షోలో ప్రసంగించారు. నేడు ఆయన రామ్ చరణ్, సురేఖతో కలిసి కుక్కుటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించనున్నారు.












Click it and Unblock the Notifications