ఏపీ సర్కార్ పై ఉద్యోగుల మరో అస్త్రం-నేటి నుంచి వర్క్ టూ రూల్ మొదలు..
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల విషయంలో చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఏపీ జేఏసీ అమరావతి నేతృత్వంలో వారు విభిన్న మార్గాల్లో నిరసనలకు దిగుతున్నారు.
విజయవాడ : ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, ఉద్యోగులకూ మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. అసలే ఎన్నికల వేళ ప్రభుత్వం తమ బకాయిల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ మేరకు ఉద్యమం ప్రారంభించిన ఉద్యోగులు.. విభిన్న రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఉద్యమాన్ని మరో మలుపు తిప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఇవాళ్టి నుంచి వర్క్ టూ రూల్ పాటించాలని ఏపీ జేఏసీ అమరావతి పిలుపునిచ్చింది. ఈ మేరకు జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. ఇందులో ఆయన .. ఉద్యోగులు ప్రభుత్వం బకాయిలు చెల్లించనందుకు నిరసనగా ఇవాళ్టి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5. 30 వరకూ మాత్రమే పనిచేయాలని కోరారు. ఈ మేరకు ఉద్యమంలో పాల్గొంటున్న ఉద్యోగ సంఘాలన్నింటికీ సమాచారం పంపారు. దీంతో ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే పని నిలిపివేయనున్నారు.

మరోవైపు సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు సైతం ఉద్యమంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈ నెల 23న సీఎస్, ఆర్థిక కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.ఈ నెల 23న సీపీఎస్ ఉద్యోగులందరూ తమ శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు ఈ ఏడాది జీతంలో 10శాతం మినహాయించిన జగన్ సర్కార్ ప్రభుత్వ వాటాతో కలిపి పెన్షన్ ఖాతాకు జమ చేయలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో 90 శాతం జీతం ఇచ్చి.. ఐటీ మాత్రం మొత్తం జీతానికి ఎలా వసూలు చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications