ఫుల్లు కిక్కు, ఆ బ్రాండ్లదే హవా - కొత్త రికార్డు.. తాజా నిర్ణయం..!!
ఏపీలో మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చింది. రూ 99 కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత బార్ల పాలసీకి వ్యాపారులు అంతగా ఆసక్తి చూపకపోయినా.. మద్యం ఆదాయం మాత్రం గతం కంటే పెరిగింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో తొలి అయిదు నెలల్లో 10.29శాతం అమ్మకాలు పెరిగాయి. ఈ ఏడాది రూ 30 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల్లో అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసింది. ఈ వివరాలను ఇటీవలి కలెక్టర్ల సదస్సులో ఆ శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఐదు నెలల కాలంలో 10.29శాతం అమ్మకాలు పెరిగాయి. 2024-25లో రూ.11,812 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది అదే కాలంలో రూ.13,028 కోట్ల విక్రయాలు జరిగాయి. అదే తెలంగాణలో 3.45 శాతం, తమిళనాడులో 5.3 శాతం, కర్ణాటకలో 4.27 శాతం, కేరళలో 6.74 శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయి. గతేడాది అక్టోబరులో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఐదు నెలల కాలంలో ఏపీ 11.05 శాతం వృద్ధి సాధించింది. తెలంగాణ 0.65 శాతం, తమిళనాడు 2.53 శాతం, కర్ణాటక 13.64 శాతం, కేరళ 6.25 శాతం ఆదాయం పెరిగింది.

ఏపీలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.29,442 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.30 వేల కోట్లు దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, జిల్లాలవారీగా గడిచిన 5 నెలల అమ్మకాలు పరిశీలిస్తే కర్నూలు టాప్‌లో ఉంది. తెలంగాణతో సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉండే ఆ జిల్లాలో 57శాతం అమ్మకాలు పెరిగాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 53 శాతం, అల్లూరిలో 52 శాతం, చిత్తూరులో 44శాతం అమ్మకాలు పుంజుకున్నాయి.
కానీ, విజయనగరం, కృష్ణా, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అమ్మకాలు పెరగకపోగా తగ్గాయి. గుంటూరు, నెల్లూరులో 3 శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయి. అయితే, కొన్ని జిల్లాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనల కారణంగా అమ్మకాలు తగ్గుతున్నాయనే నివేదికలు అందుతున్నాయి. ప్రస్తుత బార్ల పాలసీ పైన మద్యం వ్యాపారులు ఆసక్తి చూపటం లేదు. దీంతో, ఏఈఆర్టీ సడలింపు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications