మా కొద్దు బాబోయ్.. మద్యం వ్యాపారుల తాజా నిర్ణయం..!!
ఏపీలో మద్యం వ్యాపారుల్లో భిన్న వైఖరి కనిపిస్తోంది. గతంలో వైన్ షాపులు.. బార్ల కోసం పోటీ పడీ మరి దక్కించుకున్న వ్యాపారులు.. ఇప్పుడు బార్ల టెండర్లు అంటే దూరంగా ఉంటున్నారు. మాకు వద్దు బాబోయ్ అంటున్నారు. బార్లకు దరఖాస్తులు రాకపోవటంతో సగం వాటికే లాటరీల ద్వారా కేటాయింపులు చేసారు. మిగిలిన వాటికి తిరిగి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అయినా, పరిస్ధితిలో మార్పు కనిపించటం లేదు. ఇప్పుడు వ్యాపారులు టెండర్లు దాఖలు చేసే అంశం ఎక్సైజ్ అధికారులకు బిగ్ టాస్క్ గా మారుతోంది. దీంతో, అసలు మద్యం వ్యాపారంలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.
నూతన బార్ల కేటాయింపు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. బార్ల పాలసీకి వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. తొలి విడతలో దరఖాస్తుల తుది గడువు పొడిగించి వేచి చూసినా సగం బార్లకే దరఖాస్తులు వచ్చాయి. దీంతో, రీ నోటిఫికేషన్ జారీ చేసారు. అయినా.. స్పందన అంతంత మాత్రం గానే కనిపిస్తోంది. దీనికి వ్యాపారులు పలు కారణాలు చెబుతున్నారు. నిబంధనలతో వ్యాపారం చేయలేమనే నిర్ణయానికి వస్తున్నారు. బార్ పాలసీలో భాగంగా తీసుకొచ్చిన నిబంధనల్లో ప్రధానంగా ప్రతి బార్‌కు 4 దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధన, ఇష్యూ ప్రైస్‌పై 15 శాతం అదనంగా అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్(ఏఆర్‌ఈటీ) వసూలు అంశాల పై వ్యాపారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కొత్త బార్ పాలసీలో ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తు లు తప్పనిసరిగా రావాలనే నిబంధన పెట్టింది. ఈ నిబంధనలను వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో గత ప్రభుత్వం బార్లకు ఇచ్చే మద్యంపై అదనంగా విధించిన ఏఆర్‌ఈటీని ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సాధారణంగా మద్యం షాపులకు ఇష్యూ ప్రైస్‌పై మద్యం సరఫరా చేస్తారు.
అంటే ఎమ్మార్పీలో లైసెన్సీకి ఇచ్చే మార్జిన్ మినహాయించుకుని మద్యం ఇస్తారు. ఇక.. మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్స్ కు అనుమతి ఇవ్వటం కూడా బార్ల వ్యాపారం పైన ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు ఎక్సైజ్ అధికారులకు బార్లకు దరఖాస్తుల అంశం సమస్యగా మారుతోంది. నిర్దేశిత సమయం లోగా దరఖాస్తులు వచ్చేలా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications