విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుపై రూమర్స్ నమ్మొద్దు: రైళ్ల వేళల్లో భారీ మార్పులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోను ఏర్పాటుపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే బోర్డు తెలిపింది. విశాఖ కేంద్రంగా ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది.
అయితే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటుకు భువనేశ్వర్ అంగీకరించడం లేదని, సాంకేతికంగా చూసినా విశాఖలో రైల్వే జోన్ సాధ్యం కాదని రైల్వేశాఖ నిర్ణయించినట్లు బుధవారం పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన రైల్వేబోర్డు ఏపీలో కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ అన్ని వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి ఓ నివేదికను అందజేసిందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఉమాశంకర్ కుమార్ తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా రైల్వేశాఖ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉంటే ఈరోజు నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్ల వేళలు, స్టాపేజ్‌లు, వాటి నెంబర్లు, నడిచే రోజులు తదితరాల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది.
అక్టోబర్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త టైంటేబుల్ ఏడాది పాటు అమలులో ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేసిన మార్పుల వివరాలను బుధవారం అధికారులు విడుదల చేశారు. ఆ వివరాలతో కూడిన టైంటేబుల్ పుస్తకాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ తెలిపారు.
దురంతో రైళ్లకు కొత్త స్టాపులను, 4 ఎక్స్‌ప్రెస్, 2 ప్యాసింజర్ రైళ్లను మరిన్ని స్టేషన్లకు పొడిగించగా మూడు రైళ్ల మార్గాన్ని మళ్లించారు. 30 రైళ్ల వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించారు. 12 రైళ్ల నెంబర్లను మార్చగా, 59 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. తిరుపతి- హజ్రత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌తో సంబంధం లేకుండా కాచిగూడ మీదుగా ప్రయాణిస్తుంది.
సికింద్రాబాద్ - విశాఖపట్నం దురంతో ఎక్స్ ప్రెస్ ఇకపై విజయవాడలో ఆగుతుంది. సికింద్రాబాద్ - ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పుణేలో ఆగుతుంది. యశ్వంత్ పూర్ - ఢిల్లీ సరాయి రోహిల్లా దురంతో ఎక్స్ ప్రెస్ గుంతకల్, సికింద్రాబాద్ లో, హౌరా - యశ్వంత్ పూర్ దురంతో ఎక్స్ ప్రెస్ విజయవాడ, రేణిగుంటలో, చెన్నై - హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ విజయవాడలో ఆగుతాయి.
సికింద్రాబాద్ - తిరుపతి మధ్య తిరిగే పద్మావతి ఎక్స్ ప్రెస్ ప్రస్తుతం సోమ, గురు, శుక్ర, శని, ఆది వారాల్లో తిరుగుతుండగా, కొత్తగా మంగళవారాన్ని కలిపి శనివారాన్ని తొలగించారు. ఇదే సమయంలో తిరుపతి నుంచి వచ్చే రైలులో ఆదివారాన్ని తొలగించి బుధవారాన్ని కలిపారు. సికింద్రాబాద్ నుంచి పాకాల మీదుగా తిరుపతి వెళ్లే రైలు ప్రస్తుతం మంగళ, బుధవారాల్లో తిరుగుతుండగా, ఇకపై బుధ, శనివారాల్లో ప్రయాణించనుంది.
ఇదే రైలు తిరుగు ప్రయాణంలో బుధ, గురువారాలను, గురు, ఆదివారాలుగా మార్చారు. వీటితో పాటు సికింద్రాబాద్ - కర్నూలు సిటీ, తెనాలి - రేపల్లె పాసింజర్, తెనాలి - మార్కాపూర్ రోడ్ం గుంటూరు - తెనాలి, నర్సాపూర్ - గుంటూరు - తెనాలి, గుంటూరు - మాచర్ల - భీమవరం, భీమవరం - రాజమండ్రి - నర్సాపూర్, మాచర్ల - నడికుడి, కాచిగూడ - గుంటూరు మధ్య ప్రయాణించే రైళ్ల నంబర్లను మార్చారు.
'తెలంగాణ ఎక్స్‌ప్రెస్' గా పేరు మారనున్న 'ఏపీ ఎక్స్‌ప్రెస్'
సికింద్రాబాద్-న్యూఢిల్లీల మధ్య రాకపోకలు సాగిస్తున్న ‘ఏపీ ఎక్స్‌ప్రెస్' ఇకపై ‘తెలంగాణ ఎక్స్ ప్రెస్'గా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సికింద్రాబాద్-న్యూఢిల్లీల మధ్య రాకపోకలు సాగిస్తున్న ఈ రైలు పేరును ‘తెలంగాణ ఎక్స్ ప్రెస్' గా మార్చాలన్న తెలంగాణ ప్రభుత్వ విన్నపానికి రైల్వే శాఖ సమ్మతించింది. ఇప్పటికే ఈ రైలు పేరును మారుస్తూ ఆ శాఖ నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఆ ఆదేశాలు ఈరోజు నుంచి అధికారికంగా అమల్లోకి వస్తాయి.












Click it and Unblock the Notifications