ఏపీలో ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం..!!
ఏపీలో ఎన్నికల సమయంలో ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రాష్ట్ర విభజన జరిగి ఇప్పటి వరకు పరిష్కారం కాని అంశాల పైన ఇప్పుడు ముందడుగు పడుతోంది. ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఆస్తుల విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో, కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆస్తుల పంపకాలు: 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆస్తుల పంపకాల పైన ప్రభుత్వం కమిటీలు వేసింది. ఢిల్లీలోని ఆస్తుల పైన పలు విడతలు చర్చలు జరిగాయి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో రెండు ప్రభుత్వాల అధికారులు తమ ప్రతిపాదనలు చెబుతూ వచ్చారు. ఇక, ఇప్పుడు ఢిల్లీలోని ఉమ్మడి ఆస్తుల విభజనకు మార్గం సుగమం అయింది.

మొత్తం 19.781 ఎకరాలలో ఉన్న ఉమ్మడి భవన్ ఆస్తులలో ఏపీకి 11,356 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించాలని టి-ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఏపీ సర్కారు సముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ స్పందనను కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది.
ప్రభుత్వాల అంగీకారం: ఏపీ భవన్ కింద ఉన్న గోదావరి బ్లాక్ 4.315 ఎకరాలు, శబరి బ్లాక్‌తో పాటు అంతర్గత రహదారులు, దుకాణాలు(ఆక్రమణకు గురైన ప్రాంతం) ఉన్న 0.512 ఎకరాలు, నర్సింగ్ హాస్టల్ 3.359 ఎకరాలు, పటౌడీ హౌస్‌లో 2.396 ఎకరాలు ఏపీకి ఇచ్చేలా ప్రతిపాదన చేశారు. అదే విధంగా శబరి బ్లాక్ కింద ఉన్న 3 ఎకరాలు, పటౌడీ హౌస్‌లో ఉన్న 5.245 ఎకరాలు తమకు కేటాయించేలా తెలంగాణ ప్రతిపాదన చేసింది.
అయితే తమకు ప్రతిపాదించిన అంతర్గత రహదారులు, దుకాణాలు(ఆక్రమణలు) ఉన్న ప్రాంతం(0.512 ఎకరాలు) విలువ దాదాపు రూ.250 కోట్లు ఆని, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేకపోతే అందుకు సరిసమానమైన భూమిని శబరి బ్లాక్ లేదా పటౌడీ హౌస్‌లోని భూమి నుంచి కేటాయించాలని ఏపీ షరతు విధించింది.
విభజన పరిష్కారం: దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరుతూ కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కాగా ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్‌కు భూములు, భవనాలు సహా దాదాపు రూ.9,913.505 కోట్ల(దాదాపు పది వేల కోట్లు) విలువైన ఆస్తులు ఉన్నాయి. గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ అనే విభాగాల కింద ఉమ్మడి భవన్ ఆస్తులు ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రానికి బయట ఉన్న ఆస్తులను రెండు తెలుగు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచారు. దీంతో..దాదాపు పదేళ్ల కాలంగా సాగుతున్న ఈ పంపకాల వ్యవహారం దాదాపు పరిష్కారం అయినట్లుగానే కేంద్ర అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications