ఏపీలో ఏప్రిల్, మేలో వరుస ఎన్నికలు- జగన్ సర్కార్ ప్లాన్- ఎస్ఈసీ కసరత్తు
ఏపీలో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ తర్వాత స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు దాదాపుగా తొలగిపోయినట్లే కనిపిస్తోంది. అప్పటివరకూ ప్రభుత్వం అవునంటే నిమ్మగడ్డ కాదని, ప్రభుత్వం కాదంటే నిమ్మగడ్డ అవుననే పరిస్ధితి నుంచి ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుత ఎస్ఈసీ నీలం సాహ్నీ ఆధ్వర్యంలో తాము అనుకున్న విధంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏప్రిల్, మే నెలల్లో వరుసగా పెండింగ్‌లో ఉన్న అన్ని స్ధానిక ఎన్నికలను పూర్తి చేసే లక్ష్యంగా ఇద్దరూ ముందుకు కదులుతున్నారు.
నిమ్మగడ్డ స్ధానంలో నీలం సాహ్నీ- ఈసారి టీడీపీ వర్సెస్ ఎస్ఈసీ- నిష్పాక్షికత ఏదీ ?

ఏపీలో పెండింగ్‌లో స్ధానిక ఎన్నికలు
ఏపీలో ఇప్పటివరకూ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసినా, ఇంకా వీటిలో పలు స్ధానాలకు ఎన్నికలు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో న్యాయ వివాదాలతో పాటు ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల కారణంగా పలు ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటితో పాటు ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 8న జరగబోతున్నాయి. ఇంకా మిగిలిన సహకార ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంది. వీటిలో సాధ్యమైనంత మేరకు అన్ని ఎన్నికలను పూర్తి చేయక తప్పని పరిస్ధితి నెలకొంది.

ఏప్రిల్, మేలో వరుస ఎన్నికలు
ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటికే ఎస్‌ఈసీ నీలం సాహ్నీ నోటిపికేషన్ జారీ చేశారు. ఇవి ముగిశాక పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. వివిధ కారణాలతో నిలిచిపోయిన పలు కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ కలుపుకుంటే మొన్న జరిగిన మున్సిపల్ పోరుతో సమానంగా ఉండటంతో వీటిని ఎదుర్కోవడం కూడా ప్రభుత్వానికి సవాలే. దీంతో పంచాయతీ, మున్సిపల్ విజయాల ఊపు తగ్గకముందే వాటిని కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో ఏప్రిల్, మే నెలల్లో వరుస ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది.

ఖాళీల వివరాలు కోరిన ఎస్ఈసీ నీలం సాహ్నీ
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పెండింగ్ స్ధానాల వివరాలను తమకు పంపాలని ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇరుశాఖల అధికారులను కోరారు. వివిధ కారణాలతో నిలిచిపోయిన ఎన్నికలు, వాటిపై హైకోర్టు ఇచ్చిన తీర్పులు, ఇతర వివరాలను తమకు పంపాలని ఎస్ఈసీ కోరారు. దీంతో ఆయా శాఖలు సదరు వివరాలు పంపేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముగిశాక ఈ వివారలు కూడా అందితే వాటి ఆధారంగా ఏప్రిల్ నెలాఖరులో పంచాయతీ పోరును, మే నెలలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు.

ఎన్నికలు జరగాల్సింది ఇక్కడే
ఈ ఏడాది ఫిబ్రవరిలో దాదాపు 13 వేలకు పైగా పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. అయితే కోర్టు కేసులతో పాటు వివిధ కారణాలతో 276 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. అయితే ప్రభుత్వం ఆ తర్వాత వీటిలో పలు పంచాయతీలను సమీపంలోని నగర పంచాయతీల్లో, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విలీనం చేసింది. ఆ తర్వాత మిగిలిన 120 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే మున్సిపల్ పోరులో చూసుకుంటే 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 12 కార్పోరేషన్లలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. మరో 3 కార్పోరేషన్లు, 32 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఎన్నికలు మేనెలలో జరిగే అవకాశం ఉంది.