TTD లో ఈ పథకానికి విరాళమిస్తే.. ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం, మార్గదర్శకాలు..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరటం తో భక్తులు రద్దీ పెరిగింది. ఆదివారం 90,826 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. క్యూ లైన్ల లో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో శ్రీవాణి కోటా తో పాటుగా టీటీడీ అమలు చేస్తున్న మరో పథకానికి భక్తుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది.
తిరుమల తో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. ఆదివారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. కాగా, టీటీడీ ట్రస్టుల్లో శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి ఆదరణ పెరుగుతోంది. రూ.లక్ష విరాళం అందజేస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనం(ఒకసారి మాత్రమే) కల్పిస్తున్న నేపథ్యంలో భక్తులు ఆసక్తి చూపుతున్నారు. శ్రీవేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ఆధ్వర్యంలో నవజాత శిశువులు, చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన నిధులను దాతల ద్వారా సమీకరించేందుకు టీటీడీ 2022లో శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకాన్ని ప్రారంభించింది.

స్పందిస్తున్న భక్తులు.. పథకానికి విరాళాలు
కాగా, ఈ పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోంది. శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి నిర్వహణ కోసం రూ.కోటి విరాళమిచ్చే దాతలు ఇప్పటికే ఎస్వీ ప్రాణదానం ట్రస్టు ద్వారా లభించే ప్రత్యేక సదుపాయాలను అందుకుంటున్నారు. అలాగే వైద్య పరికరాల కొనుగోలు, ఆస్పత్రి నిర్మాణం కోసం ఎక్కువ విరాళాలు ఇచ్చేవారికి కూడా టీటీడీ ప్రివిలేజెస్ ఇస్తోంది. ప్రస్తుతం ఒక చిన్నారి గుండె శస్త్ర చికిత్సకు అవసరమయ్యే మందులు, ఆక్సిజనేటర్లు, శస్త్రచికిత్స పరికరాలు, ఇంప్లాంట్ల కోసం సుమారు రూ.లక్ష ఖర్చు అవుతోంది. ఈక్రమంలో ఈ మొత్తాన్ని వ్యక్తులు, సంఘాలు లేదా కార్పొరేట్ సంస్థలు విరాళాలు అందించవచ్చు. ఎస్వీ ఆపన్న హృదయ పథకానికి రూ.లక్ష విరాళం ఇస్తే మరుసటి రోజున ఐదుగురు భక్తులకు ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తారు. రూ.లక్ష విరాళంతోపాటు టికెట్ ధర రూ.2,500 కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న టికెట్లు నిమిషాల వ్యవధిలో బుక్ అవుతున్న క్రమంలో భక్తులు సైతం ఈ పథకానికి విరాళం ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు.













Click it and Unblock the Notifications