సూపర్ టేస్టీ కరివేపాకు పొడి.. ఇలా ఈజీగా చేసుకోండి..!
మనం సాధారణంగా కూరలు, పప్పు, చారు ఇలా ఏ వంట వండినా అందులో తప్పకుండా రెండు రెమ్మల కరివేపాకు వేస్తుంటాం. ఇలా వంటల్లో కరివేపాకు వేసుకోవడం వల్ల కమ్మదనం పెరుగుతుంది. అలాగే కరివేపాకులను రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం అని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులను తినడం వల్ల గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుందని అజీర్ణం, కడుపుబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు. అలాగే కరివేపాకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి కరివేపాకుతో చాలామంది చట్నీ చేసుకుంటారు. ఇంకొంతమంది కరివేపాకు పొడి కూడా చేసుకుంటారు. మరి ఇంట్లోనే ఈజీగా కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
కరివేపాకు పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. కరివేపాకు ఒక పెద్ద కప్పు(శుభ్రంగా కడిగి పెట్టినవి), వెల్లుల్లి రెబ్బలు 6 నుంచి 8 పొట్టు తీసినవి, ఎండుమిర్చి 10 నుంచి 12 కారానికి తగినంత, ధనియాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర అర టేబుల్ స్పూన్, పల్లీలు ఒక టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, ఇంగువ చిటికెడు తీసుకోవాలి. ఇక తయారీ విధానం చూస్తే.. ముందుగా కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి, తేమ లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి.

ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకోవాలి. అందులో జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, వెల్లుల్లి రెబ్బలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో కరివేపాకు ఆకులను వేసి అవి క్రిస్పీగా అయ్యేంత వరకూ వేయించుకోవాలి. చివరగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించిన పదార్థాలను పూర్తిగా చల్లారాక వాటిని మిక్సీ జార్ లో వేసి తగినంత ఉప్పు చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తయారైన కరివేపాకు పొడిని గాలి చొరబడని డబ్బాలో భద్ర పరచుకోవాలి. ఈ కరివేపాకు పొడిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది.












Click it and Unblock the Notifications