ఏపీ ప్రజలకు సువర్ణావకాశం.. వారికి 20వేల రూపాయల అదనపు రాయితీ!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకాన్ని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ని ప్రోత్సహించడానికి కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన క్రింద రాయితీ పైన సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవటానికి తమ వంతు సహకారాన్ని అందిస్తుంది.
సోలార్ యూనిట్ల ఏర్పాటుకు వారికి రాష్ట్ర ప్రభుత్వ రాయితీ
అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారికి సొంత ఇళ్ళల్లో సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి 20వేల రూపాయల రాయితీని అందిస్తుంది. కేంద్రం ఇచ్చే రాయితీ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా రాయితీ ఇస్తూ బీసీలను ప్రోత్సహిస్తుంది. మరోవైపు ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన కింద ఎస్సీ, ఎస్టీలకు రెండు కిలోవాట్ల సోలార్ యూనిట్లు ఉచితంగా ఇస్తోంది.

సోలార్ యూనిట్ ఏర్పాటు పైన రూ.80వేల ఆర్థిక సహాయం
బీసీలకు సైతం ఈ పథకాన్ని కేంద్రం అందిస్తోంది. బీసీలకు రెండు కిలోవాట్ల యూనిట్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ఇచ్చే రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20వేల అందజేయడంతో బీసీలకు సోలార్ యూనిట్ ఏర్పాటు పైన 80 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ప్రస్తుతం మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్లకు 78 వేల రూపాయల రాయితీని ప్రభుత్వం అందిస్తోంది.
ఈ రాయితీతో బీసీలకు డబుల్ బెనిఫిట్
సుమారు 2.20 లక్షలు ఖర్చయ్యే ఈ యూనిట్లకు, రాయితీ పోగా మిగిలిన 1.42 లక్షలకు బ్యాంకు రుణాలు పొందేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. ఏపీలో బీసీలు ఎక్కువగా ఉండటం వల్ల బీసీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలలో ఈ రాయితీ ప్రయోజనం చేకూరుస్తుందని, వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో బీసీ వర్గాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని పేర్కొంది.
కేంద్ర పథకం సక్సెస్ కోసం రాష్ట్రం రాయితీ
పర్యావరణహిత పునరుత్పాదక ఇంధన వినియోగం ప్రోత్సహించబడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ రాయితీలతో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకొని ప్రయోజనాలను పొందాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సక్సెస్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తుంది.












Click it and Unblock the Notifications