Jupudi Prabhakar..అడ్వైజర్‌గా అపాయింట్: జీవో జారీ
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జూపూడి ప్రభాకర్‌కు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారు. ఈ విషయంలో ఎదురైన కొన్ని అభ్యంతరాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశంలో చేరి.. మళ్లీ సొంత గూటికి వచ్చిన జూపూడి ప్రభాకర్‌కు కీలక పదవిని అప్పగించడం వల్ల కొంత అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ.. వాటి మీద వైఎస్ జగన్ దృష్టి పెట్టలేదు. నమ్మి.. సొంత గూటికి వచ్చారనే కారణంతో- కీలక బాధ్యతలను అప్పగించారు.
జూపూడి ప్రభాకర్‌ను సామాజిక న్యాయ సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తోన్న కాంతిలాల్ దండే ఈ మేరకు కొద్దిసేపటి కిందటే జీవో జారీ చేశారు. బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి రెండేళ్ల పాటు జూపూడి ఆ హోదాలో కొనసాగుతారు. ఆయనకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం, ఇతర సదుపాయాలతో కూడిన మరో ఉత్తర్వు ఇంకా వెలువడాల్సి ఉంది.

మొన్నటి వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, నామినేటెడ్ పదవులను భర్తీ చేసే సమయంలోనే జూపూడి పేరును కూడా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఛైర్మన్ల ఎంపిక జాబితాలో ఆయన పేరును కూడా చేర్చింది. సామాజిక న్యాయ సలహాదారుగా నియమిస్తామని తెలిపింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీని వీడి.. తెలుగుదేశంలో చేరి పదవులు అనుభవించిన జూపూడికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అప్పట్లోనే పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే.
జూపూడి ప్రభాకర్ ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఆయన హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలైంది. అధికారాన్ని అందుకోలేకపోయింది. ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఆ తరువాత జూపూడి ప్రభాకర్ వైఎస్సార్సీపీకి గుడ్‌బై చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా పసుపు కండువాను కొప్పుకొన్నారు. టీడీపీ నేతగా వైఎస్ జగన్‌పై ఘాటు విమర్శలను సంధించిన సందర్భాలు కూడా లేకపోలేదు. వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రపైనా విమర్శలు చేశారు. దీనితో ఆయన మీద వైఎస్సార్సీపీలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. 2019 నాటికి పరిస్థితులు తారుమారు అయ్యాయి. వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది.
ఆ తరువాత జూపూడి ప్రభాకర్ మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు. జూపూడిని పార్టీలో చేర్చుకునే సమయంలోనే వ్యతిరేకత ఎదురైంది. టీడీపీలో ఉంటూ వైఎస్ జగన్‌ను విమర్శించిన నాయకుడికి కండువా కప్పడం సరికాదనే వ్యాఖ్యలు వినిపించాయి. వాటిని పెద్దగా పట్టించుకోలేదాయన. ఇక తాజాగా మళ్లీ అడ్వైజర్ పదవిని అప్పగించడాన్నీ సొంత పార్టీ నేతలే తప్పుపట్టారు. అయినా తనపై నమ్మకంతో సొంత గూటికి చేరుకున్నారనే కారణంతో జూపూడికి ప్రాధాన్యత ఉన్న సామాజిక న్యాయ సలహాదారుగా నియమించారు.












Click it and Unblock the Notifications